షాకుల మీద షాకులు ఇస్తోన్న శ‌శిక‌ళ ప్లాన్‌     2017-01-03   23:39:51  IST  Bhanu C

త‌మిళ‌నాడులో ఇప్పుడు అమ్మ లేక‌పోతేనేం చిన్న‌మ్మ ఉందిగా అన్న‌ట్టుగా ఉంది ప‌రిస్థితి. దివంగ‌త మాజీ సీఎం జయలలిత మరణించిన నాటి నుంచే చిన్న‌మ్మ శ‌శిక‌ళ అన్నీ తానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జ‌య మ‌ర‌ణించిన వెంట‌నే సీఎం పీఠం ఎక్క‌కుండా ఆమె ప‌న్నీర్‌సెల్వంను ఈ పీఠంలో కూర్చోపెట్టి చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రించారు. అమ్మ మృతిచెందిన వెంట‌నే శశిక‌ళ సీఎం పీఠం ఎక్కితే త‌న‌మీద ఎక్క‌డ వ్య‌తిరేకత వ‌స్తుందో అని భావించిన శ‌శిక‌ళ ప‌న్నీర్‌ను సీఎం కుర్చీలో కూర్చోపెట్టారు.

అంతే ప‌న్నీర్ సీఎం అయ్యి ప‌ట్టుమ‌ని వారం రోజులు కూడా కాకుండానే ఆమె అసలు ప్లాన్‌కు తెర‌లేపారు. నెమ్మ‌దిగా పార్టీలోను, ప్ర‌భుత్వంలోను ప‌ట్టు సాధించారు. ముందుగా పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌విని చేప‌ట్టారు. ప్ర‌స్తుత కేబినెట్‌లోని మంత్రుల‌తో శ‌శిక‌ళే సీఎం అయితే బాగుంటుంద‌న్న మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. శ‌శి అలా పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌గ్గాలు చేప‌ట్టారో లేదో మ‌రో వాద‌న తెర‌మీద‌కు వ‌చ్చింది.

అన్నాడీఎంకేలో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, సీఎం ప‌ద‌వి ఒక‌రి చేతుల్లోనే ఉంటోంద‌ని…ఇప్పుడు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న శ‌శిక‌ళ‌కే సీఎం పీఠం ఇవ్వాల‌న్న డిమాండ్‌ను కొంద‌రు లేవ‌నెత్తారు. ఈ డిమాండ్ల వెన‌క శ‌శి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని కూడా గుస‌గుస‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమె సీఎం కావ‌డ‌మే మిగిలి ఉంది. ముఖ్యంగా లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై అయితే శ‌శిక‌ళ సీఎం కావాల‌ని ముందే తెగ ప్ర‌చారం ఊద‌ర‌గొట్టేస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా సీఎం పదవిని చేపట్టేందుకు చిన్నమ్మ సిద్ధం కావటమే కాదు.. అందుకు తగ్గ ముహుర్తం కూడా డిసైడ్ చేశారని చెబుతున్నారు. ముందుగా ప్ర‌స్తుత సీఎం ప‌న్నీర్ సెల్వం శ‌శికి సీఎం ప‌గ్గాలు ఇచ్చేందుకు సుముఖంగా లేరని వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు శ‌శి నెమ్మ‌దిగా ప‌ది రోజుల్లోనే పార్టీపై, ఎమ్మెల్యేల‌పై పూర్తి స్థాయిలో పట్టు సాధించ‌డంతో ప‌న్నీర్ దిగి రాక‌త‌ప్ప‌లేదు.

ఇక శ‌శిక‌ళ త‌మిళులు ఎంతో ప్రాధాన్య‌మైన పండ‌గ‌గా భావించే పొంగ‌ల్ రోజు జ‌న‌వ‌రి 12వ తేదీ ఉద‌యం ఆమె సీఎంగా ప‌గ్గాలు చేప‌ట్టేందుకు ముహూర్తం ఫిక్స్ అయిన‌ట్టు స‌మాచారం. ఇందుకోసం ఈ రోజు నుంచే త‌మిళ‌నాడులోని అన్ని జిల్లాల్లో అన్నాడీఎంకే శాఖ‌లు తీర్మానాలు చేయ‌నున్నాయ‌ని టాక్‌. ఏదేమైనా సీఎం అయ్యేందుకు జ‌య ఎపిసోడ్ త‌ర్వాత నుంచి శ‌శిక‌ళ వేసిన స్కెచ్‌లు రాజ‌కీయ మేథావుల‌కు సైతం షాక్ ఇచ్చాయి.