మోదీకి మొగుడు రాబోతున్నాడా ..? ప్రధాని ఆయనేనా ..?       2018-06-10   01:06:47  IST  Bhanu C

దేశంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల సమయం ఇంకా ఏడాది గడువు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే పార్టీలు హడావుడి మొదలెట్టేశాయి. ఎవరికి వారు సొంత సర్వేలు చేయించుకుంటూ.. ఫలితం ఎలా ఉండబోతుందో అనే అంచనాలు సిద్దంచేసుకుంటున్నాయి. ఇక్కడే ఇప్పటివరకు ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాకుండా… కాంగ్రెస్‌ కూడా ఆధిక్యం సాధించలేకపోతే ఏం జరుగుతుంది? ‘సంకీర్ణ సర్కారు’ తప్పని పరిస్థితే తలెత్తితే అందరికీ ఆమోదయోగ్యమైన ప్రధాని అభ్యర్థి ఎవరు? దీనికి ప్రస్తుతం వినిపిస్తున్న సమాధానం… మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ!

అసలు ఈ ప్రతిపాదనే ఎవరూ ఊహించనిది. కానీ దీనిపై శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ శనివారం సంపాదకీయం రాసింది. ‘‘2019 ఎన్నికల్లో ఆధిక్యతను సాధించడంలో బీజేపీ విఫలమైతే… అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జీ ప్రధాని కావొచ్చు’’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక… ‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’ అనే బీజేపీ నినాదంతో తాము ఏకీభవించడంలేదనే సందేశాన్ని ఆరెస్సెస్‌ పంపిందనే విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. ప్రణబ్‌కు ఆహ్వానంలో సంకేతం ఇదేనని ఓ వార్తా చానల్‌ కధనం ప్రచారం చేసింది.

ప్రస్తుతం వారసత్వ సారథ్యంలేని కాంగ్రెస్ నే ఆరెస్సెస్‌ చూడాలని భావిస్తోంది. తాము కాంగ్రెస్ కు వ్యతిరేకం కాదని, ‘గాంధీ’ల వారసత్వానికి మాత్రమే వ్యతిరేమని ఆరెఎస్సెస్‌ సంకేతాలు పంపింది’ అని పేర్కొంది. అదేసమయంలో… ఆరెస్సెస్‌ కార్యక్రమంలో పాల్గొనడంద్వారా ప్రణబ్‌ తాను స్వతంత్రుడినని, కాంగ్రెస్తో సంబంధాలను పూర్తిగా తెంచేసుకున్నానని చెప్పకనే చెప్పారు. ఆరెస్సెస్‌ ఆహ్వానాన్ని మన్నించడంపై కాంగ్రెస్‌ నేతలు బహిరంగంగా తప్పుపట్టినా ఆయన పట్టించుకోలేదు. కేంద్రంలో కాంగ్రెస్‌, బీజేపీయేతర ప్రభుత్వం ఉండాలని ఆకాంక్షిస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌ తదితర పార్టీలకు ప్రధానిగా ప్రణబ్‌ ఆమోదయోగ్యమైన అభ్యర్థి అవుతారని ఆ వార్తా చానల్‌ కధనం లో పేర్కొన్నారు.

ప్రణబ్ వ్యక్తిత్వం చాలా గొప్పది. దీనికి నిదర్శనం .. తనకంటే జూనియర్‌ అయిన మన్మోహన్‌ సింగ్‌ను సోనియాగాంధీ ప్రధానిగా ఎంపిక చేసినప్పటికీ ఆయన ఎక్కడా తన అసంతృప్తి, అసమ్మతిని బయటపెట్టలేదు. ‘‘ప్రణబ్‌ను కాంగ్రెస్‌ వ్యక్తిగా భావిస్తున్నప్పటికీ… ఆ పార్టీలో గాంధీల వారసత్వాన్ని నిరసించేందుకు ఆయననే ఆరెఎస్సెస్‌ ఉపయోగించుకుంది. ఏది ఏమైనా ఇప్పుడు ప్రధాని అభ్యర్థిగా ప్రణబ్ పేరు బయటకి రావడం రాజకీయంగా అనేక సంచలనాలు రేకెత్తిస్తోంది. దీన్ని అడ్డుకోవడానికే మోదీ అండ్ కో బీజేపీకి ఎక్కువ సీట్లు సంపాదించే దిశగా అడుగులు వేస్తున్నారు. తమ అహాన్ని పక్కనపెట్టి సీనియర్ నాయకుల ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారు.