కొద్ది రోజుల క్రితం తన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి, రాజకీయ బాట పట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ త్వరలోనే బహుజన సమాజ్ పార్టీ ( బీఎస్పీ ) లో చేరనున్నారు.ఈ మేరకు ఆ పార్టీ అధినేత్రి మాయావతి కీలక ప్రకటన చేశారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ తెలంగాణ అంతటా పర్యటిస్తున్నారు.జనాల్లో తనకు ఆదరణ పెరిగేలా చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆయన టార్గెట్ చేసుకుంటున్నారు.నిన్న రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాధపురం లో నిర్వహించిన బహుజన శంఖారావం సభకు ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.
” కెసిఆర్ … నేను ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ కరెంట్ కట్ చేయించి, నా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నావ్.ఇలాంటి వాటిని సహించం.నీ కరెంట్ కట్ చేసే సమయం ఆసన్నమైంది ‘ అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇటీవల ప్రవీణ్ పర్యటిస్తున్న ప్రాంతాల్లో అనూహ్యంగా కరెంటు పోతూ ఉండడంతో, ఉద్దేశపూర్వకంగానే ఇలా జరుగుతోందని ప్రవీణ్ ఆగ్రహంగా ఉంటున్నారు.ఈ నేపథ్యంలోనే ఆయన ఈ విధంగా స్పందించారు.
ఇక పాల్వంచలోని పర్యటించిన ప్రవీణ్ అక్కడ అంబేద్కర్ కొమరం భీమ్ విగ్రహాలకు పూలమాలలు వేసి, పెద్దమ్మ తల్లి అమ్మవారి దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు.

సభకు వెళ్లే దారిలో రైల్వే స్థలాల్లో నిర్మాణాలను కూల్చి వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిరాశ్రయులైన వారిని ప్రవీణ్ పరామర్శించారు.వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి గృహంలో ఇబ్బందులపైన ఆరా తీశారు.వెంటనే ఇక్కడ పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి బాధితులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేలా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.ఈనెల 8వ తేదీన తాను బడుగులకు రాజ్యాధికారం తీసుకువచ్చే దిశగా అడుగులు వేయబోతున్నా అని, దానిలో భాగంగానే బీఎస్పీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.
ఆయన పదవిలో ఉండగా ని స్వేరోస్ అనే సంస్థ ద్వారా పెద్ద ఎత్తున ఆయన సామాజిక కార్యక్రమాలు చేస్తూ , రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది ని సభ్యులుగా చేసుకున్నారు.వారి ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు.
ప్రస్తుతం ప్రవీణ్ రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.స్వేరోస్ సంస్థ సభ్యుల మద్దతుతో తెలంగాణలో బిఎస్పి ని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా ప్రవీణ్ ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తున్నారు.