ప్రియనేస్తానికి సెంచరీని అంకితం చేసిన రోహిత్.! ఇంతకీ ఆ ప్రియనేస్తం ఎవరంటే.?       2018-07-09   23:17:58  IST  Raghu V

మూడు టీ-20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో కౌంటీ గ్రౌండ్ వేదికగా జరిగి ఆఖరి టీ-20లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడిన రోహిత్ సెంచరీని నమోదు చేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. మ్యాచ్ అనంతరం దినేశ్ కార్తీక్‌తో కలిసి బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో రోహిత్ శర్మ మాట్లాడుతూ “సిరిస్ నెగ్గినందుకు చాలా సంతోషంగా ఉంది. రెండో గేమ్‌లో ఓడిపోవడంతో మూడో టీ20 కీలకంగా మారింది” అన్నాడు.

‘హిట్‌-మ్యాన్’ అన్న ముద్దు పేరు తనకు ఇష్టమా లేక ఆ ముద్దు పేరుని మార్చుకోవాలని ఉందా అని కార్తీక్ రోహిత్ ప్రశ్నించాడు. దీనిపై రోహిత్ స్పందిస్తూ ‘‘నిజాయితీగా, నాకు హిట్‌మ్యాన్ పేరంటే ఎంతో ఇష్టం. అది నా పేరుని కూడా పొలి ఉంది. అది నాకు ఇష్టం’’ అని అన్నాడు. రోహిత శర్మ ఆ సెంచరీని తనకు ఇష్టమైన సూడాన్‌కు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన తెల్లని ఖడ్గ మృగం సూడాన్‌ గత మార్చిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కెన్యాలోని ద్వార్ క్రలోవే జూలోని 45 ఏళ్ల ఖడ్గ మృగం మరణంపై ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. అందులో రోహిత్‌ శర్మ కూడా ఒకడు.

ట్విటర్‌లో ‘ నిన్నటి నా సెంచరీని చనిపోయిన నా ప్రియ నేస్తం సూడాన్‌కు అంకితమిస్తున్నాను. మనమంతా మంచి జీవనానికి ఓ మార్గం కనుగోవాలనేమో’ అని ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో ఇది తెగ వైరల్‌ అయింది. ఈ అరుదైన రైనో మరణంపై ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ సైతం అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మనమంతా సూడాన్‌ రక్షించడంలో విఫలమయ్యాం. జంతు ప్రేమికులారా ఇప్పటికైనా మేల్కొనండి, రైనోస్‌ అన్నిటిని రక్షిద్దాం.’ అని పిలుపునిచ్చాడు. శతకంతో ​ఆకట్టుకున్న రోహిత్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌తో పాటు, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ లభించిన విషయం తెలిసిందే.