దీనికే దిక్కు లేదు కాని.. వర్మ తగ్గట్లేదుగా       2018-05-05   02:21:32  IST  Raghu V

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గతంలో ఎప్పుడు లేని విధంగా తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. ఎప్పుడు కూడా తాను చేస్తున్న పనుల కారణంగా, ట్వీట్స్‌ కారణంగా విమర్శలు ఎదుర్కొన్న వర్మ తాజాగా పవన్‌ కళ్యాణ్‌పై శ్రీరెడ్డితో విమర్శలు చేయించిన కారణంగా అందరి ముందు దోషిగా నిల్చున్నాడు. ఇప్పటికే పలుసార్లు సారీ కూడా చెప్పాడు. అయినా కూడా వర్మపై సినీ వర్గాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ఆఫీసర్‌’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. కాని ఆయన సినిమాను విడుదల కానిచ్చేది లేదు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. మెగా ఫ్యాన్స్‌ కూడా ఆఫీసర్‌ను బ్యాన్‌ చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం వర్మ ముందు ‘ఆఫీసర్‌’ చిత్రాన్ని విడుదల చేసుకోవడమే కష్టమైన పని. అసలు ఆఫీసర్‌ చిత్రం విడుదల అయ్యే వరకు అనుమానంగానే ఉంది. ఇలాంటి సమయంలోనే వర్మ తాను చేయబోతున్న సినిమా గురించి ధీమా వ్యక్తం చేశాడు. తాను ముందు నుండి భావిస్తున్నట్లుగా ఈనెలోనే ‘ఆఫీసర్‌’ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. దాంతో పాటు అఖిల్‌ మూవీ కూడా ఉంటుందని, తనను తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఏ ఒక్కరు కూడా దూరం చేయలేరని, తనను బహిష్కరించే సత్తా ఎవరికి లేదు అంటూ చెప్పుకొచ్చాడు.

మీడియాలో అఖిల్‌తో వర్మ సినిమా క్యాన్సల్‌ అయ్యిందని, వర్మ ఇక తెలుగులో సినిమాలు చేయడం కష్టమే అని, అసలు వర్మ టాలీవుడ్‌లోకి అడుగు పెట్టడమే కష్టం అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై వర్మ స్పందిస్తూ తాను అఖిల్‌తో మూవీ క్యాన్సిల్‌ చేసుకున్నట్లుగా మీకు ఎవరు చెప్పారు అంటూ ప్రశ్నించాడు. తాను అఖిల్‌ కోసం స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నాను అని, ఆఫీసర్‌ విడుదలైన వెంటనే అఖిల్‌తో సినిమాను మొదలు పెడతామంటూ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం అఖిల్‌ మూడవ సినిమా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఆ చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో అఖిల్‌ మూవీ ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో వర్మతో అఖిల్‌ సినిమా ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అక్కినేని ఫ్యామిలీ విభేదాలకు చాలా దూరంగా ఉండాలని భావిస్తుంది. అందుకే వర్మతో సినిమా ఆలోచనను విరమించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అఖిల్‌ డేట్స్‌ వర్మకు దక్కుతాయని ఎవరు భావించడం లేదు. కాని వర్మ మాత్రం తగ్గకుండా స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నాడు. ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది.