ఎప్పుడూ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఏదో ఒక విషయం పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే టాలీవుడ్ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కి మరియు అతని కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో హోమ్ క్వారంటైన్ కి వెళుతున్నట్లు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే.
దీంతో ఈ విషయంపై తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.ఇందులో భాగంగా రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రంలోని “బాహుబలి” ని రప్పించి కరోనా వైరస్ ని తరిమికొట్టాలని సరదాగా ట్వీట్ చేశాడు.
అంతేగాక తొందర్లోనే రాజమౌళి కుటుంబ సభ్యులందరూ ఈ కరోనా వైరస్ బారి నుంచి కోలుకోవాలని పేర్కొన్నాడు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా మాధ్యమాలను తెగ వైరల్ అవుతోంది.
దీంతోకొందరు నెటిజన్లు ఈ ట్వీట్ పై స్పందిస్తూ ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే ఆమ్లెట్ వేసుకోవడానికి గిన్నె తీసుకురమ్మని చెప్పినట్లుంది రామ్ గోపాల్ వర్మ వ్యవహారం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరోపక్క టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత మరియు కమెడియన్ బండ్ల గణేష్ ఇటీవలే కోడిగుడ్లు బాగా తీసుకుంటే కరోనా వైరస్ బారి నుంచి తొందరగా కోలుకోవచ్చని రాజమౌళికి సూచించాడు.
దీంతో ఈ విషయంపై కూడా నెటిజన్లు బాగానే ట్రోల్స్ చేస్తున్నారు.అంతేగాక ఈ కరోనా వైరస్ కాలంలో కూడా బండ్ల గణేష్ తన పౌల్ట్రీ ఫారం ఉత్పత్తులను బాగానే ప్రమోట్ చేసుకుంటున్నాడని అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి “ఆర్.ఆర్.ఆర్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా పలు అనివార్య కారణాల వల్ల వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు తెలిపాడు.
కాగా రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం “మర్డర్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.