ఎన్టీఆర్‌కు అన్యాయంపై కేంద్రానికి కంప్లైంట్‌     2017-01-16   23:09:39  IST  Bhanu C

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ‌భౌమ, తెదేపా వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క రామారావు అంటే ఎన‌లేని అభిమానం. త‌న‌కు రాజ‌కీయంగా గుర్తింపునిచ్చిన ఎన్టీఆర్‌ను వివిధ సంద‌ర్భాల్లో ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుత్తారు. అంతేగాక ఆ అభిమానంతోనే త‌న కొడుకుకి తార‌క రామారావు అని పేరు కూడా పెట్టారు. అయితే తెలంగాణ‌లో ఎన్టీఆర్ విగ్రహాలు నిర్ల‌క్ష్యానికి గుర‌వ‌తుండ‌టంపై తెదేపా ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అంతేగాక ఎన్టీఆర్‌కు జ‌రిగిన అన్యాయంపై కేంద్రానికి కంప్లైంట్ చేస్తాన‌ని హెచ్చ‌రించారు.

తెలంగాణ కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. ఎన్టీఆర్ పట్ల తనకు ఉన్న విశ్వాసాన్ని చాటుకోవడానికి ఎన్టీఆర్‌ వర్థంతిని సీఎం కేసీఆర్ అధికారికంగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహాల పట్ల ప్రభుత్వం నిర్ల‌క్ష్య ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని ఆరోపించారు. నిజామాబాద్ హైవేలో కొంపల్లి సమీపాన ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్టీ కార్యకర్తలు – నాయకులతో కలిసి రేవంత్ స్వయంగా శుభ్రం చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ కేసీఆర్ కు రాజకీయ జీవితాన్నిచ్చింది ఎన్టీఆరేనని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహాలు మసకబారిపోతే టీడీపీ కూడా కనుమరుగవుతుందని టీఆర్ ఎస్ కలలు కంటోందని విమర్శించారు.

గతంలో బేగంపేట విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు ఉండేదని ఆ విమానాశ్రయాన్ని శంషాబాద్ కు తరలించే సమయంలో దేశీయ టర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు అంతర్జాతీయ టర్మినల్‌కు రాజీవ్ గాంధీ పేరు పెట్టాలని నిర్ణయించార‌ని రేవంత్ గుర్తు చేశారు. అయితే విమానాశ్రయాన్ని శంషాబాద్ కు తరలించిన తరువాత ఎన్టీఆర్ పేరును పూర్తిగా తొలగించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా దేశీయ టర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడానికి అంగీకరించినా.. ఇప్పటికీ ఎన్టీఆర్ పేరు పెట్టలేదన్నారు. ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే తెలంగాణ ప్ర‌భుత్వంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.