యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చౌటుప్పల్ బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి శనివారం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో రిప్రజెంటేషన్ ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చౌటుప్పల్ లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కావడానికి ప్రభుత్వ నియమాలు,మార్గదర్శకాలు అనుకూలంగా ఉన్నాయని, అన్ని శాఖల డివిజన్ కార్యాలయాలతో పాటు, రెవిన్యూ డివిజన్, మున్సిపాలిటీగా ఉందని, ఇక్కడ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిపారు.
యాదాద్రి జిల్లాలో భువనగిరి జిల్లా కేంద్రాన్ని మినహాయిస్తే ఏకైక రెవిన్యూ డివిజన్ గా చౌటుప్పల్ ప్రాంతం ఉందని, అన్ని కోర్టులు ఏర్పాటు చేసుకునే విధంగా ఇప్పటికే ప్రభుత్వం 5 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసి జ్యుడీషరీ పొజిషన్లో ఉందని గుర్తు చేసినట్లు చెప్పారు.వీటితో పాటు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకి కావలసిన పెండింగ్ కేసులకు సంబంధించి చౌటుప్పల్ ప్రాంతంలోని ఎక్కువగా ఉన్నాయన్నారు.
వెంటనే స్పందించిన సిఎం రేవంత్ రెడ్డి లా సెక్రెటరీకి ఫోన్ చేసి పరిశీలించమని ఆదేశించారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఊడుగు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు తాడూరు పరమేష్,జనరల్ సెక్రెటరీ రాపోలు శ్రీను,కోశాధికారి పడమటి జైపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు,మాజీ ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి,మాజీ జెడ్పిటిసి చిలుకూరు ప్రభాకర్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ నాయకులు పబ్బు రాజు,బార్ అసోసియేషన్ కు చెందిన 40 మంది అడ్వకేట్లు పాల్గొన్నారు.