టీఆర్ఎస్ కి రెబెల్స్ బెడద .. వీధికెక్కిన విబేధాలు  

అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల బరిలోకి ఉత్సాహంగా వెళ్తున్న టీఆర్ఎస్ అధినాయకత్వం ఆశలపై నీళ్లు చల్లుతున్నారు ఆ పార్టీ అసమ్మతివాదులు. ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్యెల్యేలు చాలామందికి సీటు దక్కడంతో ఇప్పటివరకు తమకే టికెట్ అవకాశం వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న కొంతమందికి ఈ పరిణామం మింగుడుపడడంలేదు. ఎందుకంటే గత కొద్ది నెలలుగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక సర్వేలు చేయించాడు. వాటిలో సిట్టింగ్ ఎమ్యెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వారికి ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా గెలవడం కష్టం అని తేలడంతో సిట్టింగ్ ఎమ్యెల్యేకు ఇక సీటు దక్కదని తమకు అవకాశం ఉంటుందని చాలామంది ఆశావాహులు ఎదురుచూసారు.దీనికోసం పార్టీ కార్యక్రమాల కోసం భారీగానే ఖర్చు పెట్టారు. అయితే సీన్ రివర్స్ అవడంతో వారు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు.

Rebels Pose Challenge To TRS Party-

Rebels Pose Challenge To TRS Party

ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా.. మళ్లీ సిట్టింగ్ లకే టిక్కెట్లు కేటాయించటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అనేక జిల్లాలో ర్యాలీలతో నిరసన తెలియజేశారు. పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్లు రాణి వారంతా రెబెల్స్ గా ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా .. ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ నుంచి రెబల్స్‌ సంఖ్య భారీగానే ఉండబోతోంది. పన్నెండు సీట్లకు గాను, అధిష్ఠానం పది సీట్లను ఖరా చేయగా.. టిక్కెట్లు దక్కనివారంతా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. టిక్కెట్లు ఖరారు చేయని హుజుర్‌నగర్‌, కోదాడ స్థానాల్లోనూ ఎవరికివారు తమకే అవకాశం వస్తుందని ఆశలు పెట్టుకున్నారు.

అలాగే నాగార్జున సాగర్ టికెట్ నోముల నర్సింహయ్యకు టికెట్ ఇవ్వడాన్ని కోటి రెడ్డి వర్గం తప్పుపడుతోంది. అనుచరులతో సమావేశమైన కోటిరెడ్డి.. హాలియాలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. నాన్‌లోకల్ వద్దు.. లోకల్ ముద్దంటూ నినాదాలు చేశారు. షాద్ నగర్, కల్వకుర్తి, మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లో ధిక్కార స్వరం గట్టిగా వినిపిస్తోంది. నారాయణపేటలో పార్టీ కోసం పనిచేసిన తనకు కాకుండా.. టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వడాన్ని శివకుమార్ రెడ్డి తప్పుపట్టారు. పార్టీ అధిష్ఠాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు.

Rebels Pose Challenge To TRS Party-

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి వర్గం ర్యాలీ నిర్వహించారు. భూపాల్ రెడ్డి హఠావో..నారాయణ ఖేడ్ బచావో అంటూ నినాదాలతో తమ నిరసనను వ్యక్తం చేశారు. మానకొండూర్ టిక్కెట్ పై కూడా పార్టీలో అసమ్మతి సెగ మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయికి టిక్కెట్ కేటాయించటంతో సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. రసమయికి వ్యతిరేకంగా స్థానిక నేతలు ర్యాలీ నిర్వహించారు. బాల్కొండలో టిక్కెట్ ఆశించి భంగపడిన సునీల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రెబెల్ గా బరిలోకి దిగే అంశాలను పరిశీలిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల టిక్కెట్‌ ఆశించి భంగపడిన సీనియర్‌ నేత కే ఎస్‌ రత్నం.. అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ మారతారనే ప్రచారం జరిగినా.. రత్నం దాన్ని కొట్టిపారేశారు. తాను స్వతంత్ర అభ్యర్థిగానే బరిలో దిగుతానని స్పష్టం చేశారు. అటు పరిగిలో కూడా అసంతృప్త రాగం వినబడుతోంది. కొప్పుల మహేశ్వర్‌రెడ్డికి టిక్కెట్‌ ఇవ్వడంపై స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎక్కడికక్కడ పార్టీ అసమ్మతులు తమదైన శైలిలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనని పార్టీ అగ్ర నాయకులు ఆందోళన చెందుతున్నారు.