రేవంత్‌లో ఈ మార్పు వెన‌క ఏం జ‌రిగింది..!     2017-01-03   01:13:15  IST  Bhanu C

మొన్న‌టివ‌ర‌కూ `ఇత‌డికి దూకుడు ఎక్కువ` అన్న‌వారే ఇప్పుడు ఆయ‌న వైఖ‌రి చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. పార్టీలో ఎవ‌రి స‌ల‌హాలు తీసుకోకుండా ఒంటెత్తు పోక‌డ‌ల‌తో, ఇష్టం వ‌చ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని విమ‌ర్శించిన వాళ్లు ఇప్పుడు ఆ వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకుంటున్నారు. ఇంత‌కీ ఆ నాయ‌కుడు ఎందుకు త‌న దూకుడు స్వ‌భావాన్ని మార్చుకున్నారు? ఈ మార్పున‌కు కార‌ణం ఏంటి? ఇప్పుడు తెలంగాణ టీడీపీలో ఇదే చ‌ర్చ‌! ఇంత‌కీ ఆ నాయ‌కుడెవ‌రో మీకు తెలిసే ఉంటుంది క‌దూ.. అవును ఆయ‌నే రేవంత్ రెడ్డి!!

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఎవ‌రంటే ఠ‌క్కున గుర్తొచ్చే పేరు రేవంత్ రెడ్డి. దూకుడు స్వ‌భావంతో అటు అసెంబ్లీలోనూ ఇటు బ‌య‌ట వ్య‌వ‌హ‌రించే ఆయ‌న‌పై పార్టీ నేత‌లే విమ‌ర్శించిన సంద‌ర్భాలు అనేకం! పార్టీలో సీనియ‌ర్ల‌తో ఏ విష‌యంపైనా చ‌ర్చించ‌ర‌ని, ఎవ‌రినీ క‌లుపుకోకుండా ఒక్కరే మాట్లాడుతుంటార‌ని పార్టీ నాయకులే ఆరోపించేవారు. అయితే కొన్ని రోజులుగా ఆయ‌న వ్య‌వ‌హార శైలిలో మార్పు వ‌చ్చింద‌ని నేత‌లే చెబుతున్నారు.

అసెంబ్లీ స‌మావేశాల‌కు ముందు సీనియ‌ర్ నాయ‌కుల‌ను సంప్ర‌దించి వారి స‌ల‌హాలు తీసుకుంటున్నార‌ని చెబుతున్నారు. త‌న స‌హ‌జ సిద్ధ‌మైన దూకుడు స్వ‌భావాన్ని త‌గ్గించుకుని.. భూసేక‌ర‌ణ‌, ఫిరాయింపుల అంశాల్లో నిర్మాణాత్మ‌కంగా విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని మెచ్చుకుంటున్నారు. అయితే దీని వెనుక పార్టీ అధినేత చేసిన వ్యాఖ్య‌లు కూడా కార‌ణ‌మట‌.

`తెలంగాణ‌లో పార్టీకి క్యాడ‌ర్ ఉంది. కానీ ఇప్పుడు వారంద‌రినీ ఏకం చేసే నాయ‌కుడు కావాలి` అని చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతున్నారు. ఈ మాట‌ల‌ను రేవంత్ రెడ్డి బాగా వంట ప‌ట్టించుకున్నార‌ట‌. అందుకే త‌న స‌హ‌జ స్వ‌భావాన్ని ప‌క్క‌న‌పెట్టార‌ట‌. నాయ‌కులంద‌రితోనూ స‌న్నిహిత సంబంధాలు కొన‌సాగిస్తూ.. నాయ‌కుడిగా ఎదిగేందుకు ప్రయ‌త్నిస్తున్నార‌ట. పార్టీలో అంద‌రికీ ద‌గ్గ‌ర‌వ‌డం వ‌ల్ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకుని.. సీఎం అభ్య‌ర్థిగా నిలిచేందుకు అన్ని అర్హ‌త‌లు సంపాదించాల‌నేది రేవంత్ ప్లాన్‌!!