మహేష్‌25 ఆలస్యంకు మోడీ కారణం, ఎందుకు?       2018-06-07   23:17:44  IST  Raghu V

‘భరత్‌ అనే నేను’ చిత్రం తర్వాత మహేష్‌బాబు చేయబోతున్న సినిమాపై అందరి దృష్టి ఉంది. ఎప్పుడెప్పుడు మహేష్‌బాబు 25వ చిత్రం మొదలు అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భరత్‌ అనే నేను చిత్రం విడుదలకు ముందే మహేష్‌25వ చిత్రం ప్రారంభం కావాల్సి ఉంది. సెట్స్‌పైకి తీసుకు వెళ్లేందుకు ఏవో ఒక అడ్డంకులు వస్తున్నాయి. మొన్నటి వరకు నిర్మాత ప్రసాద్‌ వి పొట్లూరి కోర్టుకు వెళ్లడంతో షూటింగ్‌కు ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు కోర్టు కేసులు, ఇతరత్ర విషయాల్లో క్లారిటీ వచ్చేసింది. దాంతో షూటింగ్‌ ప్రారంభించేందుకు అంతా సిద్దం చేశారు.

సినీ వర్గాల నుండి అందిన సమాచారం మేరకు ఈనెల 10 నుండి 25 వరకు డెహ్రాడూన్‌లోని కొన్ని లొకేషన్స్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణకు ప్లాన్‌ చేశారు. లొకేషన్స్‌ వేట అంతా పూర్తి అయ్యింది. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో డెహ్రాడూన్‌లో షూటింగ్‌కు అక్కడ పోలీసులు అనుమతించలేదు. డెహ్రాడూన్‌లో జూన్‌ 21న ప్రపంచ యోగా దినోత్సవం కార్యక్రమం జరుగబోతుంది. ఆ కార్యక్రమంలో ప్రధాని మోడీ డెహ్రాడూన్‌లో కార్యక్రమం నిర్వహించబోతున్నాడు. అందుకోసం స్థానిక యంత్రాంగం అంతా కూడా సిద్దం చేస్తున్నారు. ఈ సమయంలో ఇలా షూటింగ్‌లకు అనుమతించలేం అంటూ తేల్చి చెప్పారు.

డెహ్రాడూన్‌లో మోడీ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత షూటింగ్‌కు అనుమతించడంలో ఎలాంటి ఇబ్బంది లేదని, ఖచ్చితంగా 22వ తారీకు నుండి అనుమతిస్తామంటూ అక్కడ అధికారులు చిత్ర యూనిట్‌ సభ్యులకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో మహేష్‌ 25వ చిత్రం మోడీ కార్యక్రమం కారణంగా క్యాన్సిల్‌ అయ్యిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వరుసగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న మహేష్‌ 25వ చిత్రం ఇప్పటికి కూడా సెట్స్‌ పైకి వెళ్లడం లేదు. జులై నుండి ఈ చిత్రం మొదలవుతుందేమో చూడాలి.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు మరియు అశ్వినీదత్‌లు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. డెహ్రాడూన్‌ నుండి అనుమతి వచ్చే వరకు ఆగకుండా హైదరాబాద్‌లో వారం రోజుల పాటు చిత్రీకరణ చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు అనుకున్నారు. అయితే హడావుడిగా ప్లాన్‌ చేసుకోవడంతో నటీనటుల డేట్లు సర్దుబాటు కాలేదు అంటూ సమాచారం అందుతుంది. మహేష్‌బాబు 25వ చిత్రం కోసం ప్రత్యేకంగా రెడీ అయ్యాడు. గడ్డం పెంచడంతో పాటు, కండలు పెంచి, సిక్స్‌ ప్యాక్‌ కూడా చూపించేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది.