అమెరికా ఉపాధ్యక్ష పీఠం అధిష్టించనున్న తొలి మహిళగా, తొలి నల్లజాతి వ్యక్తిగా, తొలి ఆసియన్‌గా చరిత్ర సృష్టించిన కమలా హారిస్ మరికొద్దిగంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.అయితే ట్రంప్ మద్ధతుదారుల భయంతో ఎంతో వైభవంగా జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమం నిరాడంబరంగా తుపాకీ నీడలో జరుగుతోంది.
ఈ నేపథ్యంలో కార్యక్రమానికి వెళ్లడం క్షేమమే అని మీరు భావిస్తున్నారా?’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు కమల హారిస్ తనదైన శైలిలో జవాబిచ్చారు.
మార్టిన్ లూథర్ కింగ్ స్మారకార్థం ప్రతి ఏటా జరుపుకొనే ‘నేషనల్ డే ఆఫ్ సర్వీస్’ కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్న కమలా హారిస్ మాట్లాడుతూ… అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు.
అందుకోసం ప్రమాణ స్వీకార వేదిక వద్దకు తలెత్తుకుని గర్వంగా నడుచుకుంటూ వెళతానని కమలా హారిస్ ధీమా వ్యక్తం చేశారు.అమెరికాలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే.
మార్టిన్ లూథర్ కింగ్ ఆశయాల సాధన కోసం ఇంకా పోరాడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.రాబోయే రోజుల్లో అధ్యక్షుడిగా బైడెన్, ఆయన బృందం ఎదుర్కోనున్న సవాళ్లను కమల వివరించారు.
అయితే, వాటిని సమర్థంగా ఎదుర్కోవడానికి తామంతా సిద్ధంగా ఉన్నట్లు కమల వెల్లడించారు.దేశాన్ని గాడిన పెట్టేందుకు ఎంతో చేయాల్సి వుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్, ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం, ప్రజలకు ఉపాధి కల్పించడం, కోవిడ్ నుంచి అమెరికాను కాపాడడం వంటి వాటిపై బైడెన్ తన ప్రణాళికను ప్రకటించారని కమలా హారిస్ తెలిపారు.అయితే, కొంతమంది తమ లక్ష్యాలను విమర్శిస్తున్నారని వారికి చురకలంటించారు.కానీ, తమ కృషికి చట్టసభ సభ్యుల సహకారం వుంటే ఆశయాలను చేరుకోవడం ఎంతో సులభమవుతుందని కమలా హారిస్ పేర్కొన్నారు.