మాస్ మహారాజా లాంగ్ బ్రేక్ తర్వాత ‘రాజా ది గ్రేట్’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకున్న నేపథ్యంలో రవితేజ మళ్లీ ట్రాక్ లో పడ్డాడని అంతా అనుకున్నారు. కాని ఆ చిత్రం తర్వాత చేసిన ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్టు’ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో రవితేజ కెరీర్ మళ్లీ ప్రమాదంలో పడ్డట్లయ్యింది. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాన్ని చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం విడుదల సందర్బంగా రవితేజ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. తాను హీరోగానే కాకుండా విలన్‌గా కూడా నటించేందుకు సిద్దం అంటూ ప్రకటించాడు. మంచి కథ, మంచి పాత్రతో వస్తే ఎలాంటి సినిమాల్లో అయినా నటించేందుకు తాను సిద్దంగా ఉన్నాను అంటూ ప్రకటించాడు. రవితేజ హీరోగా మెల్ల మెల్లగా రిటైర్మెంట్ కావాలని భావిస్తున్నాడేమో అంటూ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే అనిపిస్తుంది. విలన్ పాత్రలకు ఆసక్తి చూపుతున్న రవితేజ ‘తేరి’ రీమేక్ చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.
ఇటీవలే మైత్రి మూవీస్ వారు తేరి రీమేక్ రైట్స్ మా వద్ద ఉన్నాయి. రవితేజతో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆ చిత్రం రీమేక్ చేస్తామని ప్రకటించారు. అయితే రవితేజ మాత్రం తాజాగా తాను తేరి రీమేక్ లో నటించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రీమేక్ చేయడం అంత శుభం కాదని తాను భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. వరుసగా మూడు నాలుగు సక్సెస్‌లు పడితే అప్పుడు రీమేక్‌ల గురించి ఆలోచిస్తాను అంటూ పేర్కొన్నాడు. తేరి సినిమా రీమేక్ గురించి ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచన లేదు అనేది ఆయన క్లారిటీ ఇచ్చాడు.