వర్మ కొత్త బిజినెస్‌..       2018-05-27   01:27:47  IST  Raghu V

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. గత పుష్కర కాలంగా సక్సెస్‌ లేక ఢీలా పడిపోయిన దర్శకుడు వర్మ తాజాగా నాగార్జున హీరోగా ‘ఆఫీసర్‌’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం జూన్‌ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాంతో పాటు వర్మ ఒక హాలీవుడ్‌ చిత్రాన్ని మరియు రెండు బాలీవుడ్‌ సినిమాలను కూడా షురూ చేశాడు. ఒక వైపు సినిమాలు తెరకెక్కిస్తూనే మరో వైపు ఈయన వెబ్‌ సిరీస్‌లను నిర్మించడం, వెబ్‌ సిరీస్‌లకు దర్శకత్వం వహిస్తూ వస్తున్నాడు.

తాజాగా వర్మ మరో కొత్త బిజినెస్‌ను మొదలు పెట్టబోతున్నాడు. ప్రస్తుతం కంపెనీ బ్యానర్‌పై సినిమాలు మరియు వెబ్‌ సిరీస్‌లు నిర్మిస్తున్న వర్మ తాజాగా ఒక ఫిల్మ్‌ స్కూల్‌ను పెట్టాలనే నిర్ణయానికి వచ్చాడు. అతి త్వరలోనే అందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభం కాబోతున్నాయి. వర్మ ప్రారంభించబోతున్న ఫిల్మ్‌ స్కూల్‌లో నటన, స్క్రీన్‌ప్లే రైటింగ్‌, డైరెక్షన్‌, నిర్మాణంకు సంబంధించిన విషయాలు ఇలా 24 క్రాప్ట్స్‌కు సంబంధించిన శిక్షణ ఉంటుందని తెలుస్తోంది.

వర్మ శిష్యులు తెలుగు మరియు హిందీలో పదుల సంఖ్యలో అగ్ర దర్శకుగా ఉన్నారు. వర్మ పేరు చెప్పుకోని వందల మంది బతికేస్తున్నారు. మొత్తానికి వర్మ తన మార్క్‌ను, బ్రాండ్‌ను మరింతగా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే స్కూల్‌ను ప్రారంభించేందుకు సిద్దం అయ్యాడు. హైదరాబాద్‌, ముంబయి, చెన్నైలలో వర్మ స్కూల్‌లు తెరవబోతున్నాడు. మొదట హైదరాబాద్‌లో వర్మ స్కూల్‌ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వర్మ స్కూల్‌ వెనుక ఒక ప్రముఖ హిందీ నిర్మాత ఉన్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్టాండర్డ్స్‌తో అన్నపూర్ణ స్టూడియోలో మరియు రామానాయుడు స్టూడియోల్లో ఫిల్మ్‌ స్కూల్స్‌ రన్‌ చేయబడుతున్నాయి. ఆ స్కూల్స్‌కు ధీటుగా ఉంటేనే వర్మ స్కూల్‌ క్లిక్‌ అవుతుంది. మరి ఆ స్థాయిని మించి మరీ వర్మ స్కూల్‌ను రన్‌ చేయగలడా అనేది అనుమానమే. వర్మ ఏది చేసినా కూడా ఆరంభ శూరత్వమే అని అంతా అంటారు. మరి ఈ విషయంలో వర్మ ఎలా వ్యవహరిస్తాడు అనేది చూడాలి.