రాముడికి సీత ఎందుకు దూరమైంది?  

భృగు మహర్షి శాపం వల్ల అలా జరిగింది. పూర్వం దేవతలకు, అసురులకు జరిగిన ఒక యుద్ధంలో, అసురులు ప్రాణభయంతో పరుగెత్తి వెళ్లి భృగుమహర్షి ఆశ్రమంలో తలదాచుకున్నారు. మహర్షి పత్ని వారికి అభయమిచ్చి రక్షించింది. రాక్షసులకు రక్షణ కల్పించిన ఆమెను చూచి శ్రీమహా విష్ణువు ఆగ్రహంతో తన సుదర్శనచక్రంతో ఆమె శిరస్సు ఖండించాడు. భృగుమహర్షి వచ్చి తన ధర్మపత్నిని వధించిన మహావిష్ణువును ఇలా శపించాడట. ‘జనార్దనా! స్త్రీని పైగా ఋషి పత్నిని చంపరాదు. నీవు కోపంతో ఒళ్లు తెలియక నా పత్నిని సంహరించావు.

కనుక నీ మానవ జన్మలో చాలాకాలం పాటు పత్నీ వియోగంతో కుమిలిపోవుదువు గాక !’ అప్పుడు మహా విష్ణువు మహర్షిని ఓదార్చి ‘మహామునీ! లోక హితం కోసం నీ శాపాన్ని ఔదల దాలుస్తాను’ అన్నాడు. ముని శాప వశాన్నే శ్రీరాముడు కుజదోషంతో జన్మించాడు. ఎవరి జాతకంలోనైనా, కుజుడు లగ్నం నుంచి, చంద్రుడి నుంచి, శుక్రుడి నుంచి ప్రథమంలో, ద్వితీయంలో, చతుర్థంలో, సప్తమంలో, అష్టమంలో, ద్వాదశంలో – వీటిలో ఏ భావంలోనైనా ఉంటే ఆ జాతకుడికి కుజదోషం ఉంటుంది.

దానివల్ల ముందుగా కుజదశలో భార్య కాని, భర్త కాని కాలం చేస్తారు. రామునికి సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఈ దోషం వల్ల భార్యా వియోగం, భార్య మరణం సంభవిస్తాయి. వనవాసంలో కొంతకాలం శ్రీరామునికి భార్యతో ఎడబాటు కలిగింది. ఇంకా సీతామాత వాల్మీకి ఆశ్రమంలో ఉన్నప్పుడు దీర్ఘకాలం పత్నీ వియోగం కలిగింది. ఈ కుజదోషం వల్లనే భార్య సీతాదేవి ముందుగా భూమాత కౌగిటిలోకి చేరింది. శ్రీరామ శాపవృత్తాంతం శ్రీరామాయణం ఉత్తరకాండలోని 51వ సర్గలో ప్రస్తావించబడింది.