తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు.దుబ్బాక ఎమ్మెల్యే అయిన రామలింగారెడ్డి హైదరాబాద్ ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో గత కొంత కాలం నుంచి చికిత్స తీసుకుంటున్నారు.
ఈ నేపధ్యంలో పరిస్థితి విషమించి రాత్రి 2:15 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మరణ వార్తని కుటుంబ సభ్యులు దృవీకరించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కు సన్నిహితుడిగా ఉన్న ఆయన, ఇప్పటివరకూ నాలుగుసార్లు దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో విషాదఛాయలు అలముకోగా, టీఆర్ఎస్ నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
రామలింగారెడ్డి తొలుత దాదాపు పాతికేళ్ళ పాటు జర్నలిస్టుగా పని చేశారు.అప్పటి పీపుల్స్‌వార్ సంస్థతో సంబంధాలున్నాయనే నెపంతో ఆయనపై తొలిసారిగా టాడా కేసు నమోదు చేశారు.దేశంలోనే మొట్టమొదటి టాడా కేసు రామలింగారెడ్డిపైనే నమోధైంది.2004లో రామలింగారెడ్డి టీఆర్ఎస్ పార్టీ ద్వారానే ఆయన రాజకీయరంగ ప్రవేశం చేశారు.అంతకు ముందు జర్నలిస్టుగా పనిచేసిన రామలింగారెడ్డి 2004లో మొదటి సారిగా టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.అనంతరం 2008 (బై ఎలక్షన్స్), 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు.
తెలంగాణ రాష్ట్ర తొలి అంచనాల కమిటీ చైర్మన్ పదవిని రామలింగారెడ్డి చేపట్టారు.మొదటి నుంచి ప్రజలకి దగ్గరగా ఉంటూ వారి సమస్యలని పరిష్కరించడంలో రామలింగారెడ్డి ముందు ఉంటారనే పేరు ఉంది.
అందుకే వరుసగా నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలవగాలిగారు. రామలింగారెడ్డి మృతితో దుబ్బాక నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.