నన్ను బ్యాన్‌ చేసే దమ్ము ఎవడికి ఉంది?       2018-05-13   22:29:20  IST  Raghu V

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఆ మద్య శ్రీరెడ్డితో పవన్‌ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయించిన విషయం తెల్సిందే. పవన్‌ను మరియు ఆయన తల్లిని దూషించమని, అప్పుడు మంచి పబ్లిసిటీ వస్తుందంటూ స్వయంగా శ్రీరెడ్డికి తాను చెప్పినట్లుగా వర్మ ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనపై మెగా ఫ్యామిలీ చాలా సీరియస్‌ అయ్యింది. ఆయన్ను ఇండస్ట్రీ నుండి తొలగించాల్సిందే అంటూ కొందరు డిమాండ్‌ చేశారు. మెగా ఫ్యామిలీ వర్మను టాలీవుడ్‌ నుండి బహిష్కరించాల్సిందిగా బాహాటంగా డిమాండ్‌ చేయకున్నా కూడా వారి మనసులో ఆలోచన అదే అంటూ అంతా అనుకున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ ఇలా మెగా ఫ్యామిలీ అందరిపై వరుసగా విమర్శలు చేసి, ప్రతిష్ట దెబ్బ తీసేందుకు వర్మ ప్రయత్నించాడు. అందుకే ఆయన్ను టాలీవుడ్‌ నుండి ఎలిమినేట్‌ చేయాలనేది మెగా ఫ్యామిలీ ఆలోచన. అందుకు పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. మెగా ఫ్యామిలీ సభ్యుడు అల్లు అరవింద్‌ ఆ విషయంలో గట్టిగా ప్రయత్నాలు చేశాడు. కాని ఆయన అనుకున్నది సాధించడంలో విఫలం అయ్యాడు. వర్మను బహిష్కరించాలనే నిర్ణయం కొందరికి నచ్చలేదు. తాజాగా ఆ విషయమై దర్శకుడు వర్మ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది.

తాజాగా వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘ఆఫీసర్‌’ చిత్రం ట్రైర్‌ విడుదలైంది. ఆ కార్యక్రమంలో వర్మ మాట్లాడుతూ తనపై టాలీవుడ్‌లో జరిగిన కుట్రపై స్పందించాడు. తనను టాలీవుడ్‌ నుండి బహిష్కరించాలని నిర్ణయించుకున్న వారిని సున్నితంగా హెచ్చరించాడు. ఇది ఏ ఒక్కరి పరిశ్రమ కాదని, ఇక్కడ ఎవరు ఎవరిని బహిష్కరించలేరు అంటూ వర్మ పేర్కొన్నాడు. తాను అనుకున్నట్లుగా ఇండస్ట్రీలో మరియు జీవితంలో ఉంటాను. తాను ఎవరికి బయపడను. తాను తప్పు చేస్తే ఒప్పుకుని అందరి ముందు నిలబడేందుకు సిద్దం అంటూ వర్మ పేర్కొన్నాడు.

తాను పవన్‌ కళ్యాణ్‌పై శ్రీరెడ్డితో వ్యాఖ్యలు చేయించిన మాట నిజమే, అందుకు క్షమాపణలు కూడా చెప్పాను. అయినా కూడా పవన్‌ ఫ్యాన్స్‌ నన్ను ట్రోల్‌ చేయడంతో పాటు మెగా ఫ్యామిలీ వారు నన్ను ఇండస్ట్రీ నుండి ఎలిమినేట్‌ చేసేందుకు ప్రయత్నాలు చేయడం విడ్డూరంగా ఉందని, వారి ఒక్కరి సొత్తు టాలీవుడ్‌ కాదని, ఇది తెలుగు జాతి సొత్తు అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. నన్ను ఇండస్ట్రీ నుండి బ్యాన్‌ చేసే దమ్ము ఏ ఒక్కడికి లేదు అంటూ తేల్చి చెప్పాడు.

ఒక వేళ తనను ఇండస్ట్రీ నుండి బ్యాన్‌ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చాలా మందికి తెలుసు అని కూడా వర్మ పేర్కొన్నాడు. వర్మ మాటల్లో తనను బ్యాన్‌ చేయరు అనే నమ్మకం కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే వర్మ బ్యాన్‌ లేనట్లే అనిపిస్తోంది. భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూడాలి.