ర‌జ‌నీకాంత్ డైలాగ్‌: శ‌శిక‌ళకు షాక్‌     2016-12-26   03:45:18  IST  Bhanu C

సౌత్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఓ హిట్ డైలాగ్ ఇప్పుడు త‌మిళ రాజ‌కీయాల్లో చిన్న‌మ్మ, జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ‌కు క‌రెక్టుగా సూట్ అవుతుందా ? అంటే త‌మిళ రాజ‌కీయాల్లో అవున‌నే స‌మాధాన‌మే విన‌వ‌స్తోంది. ర‌జ‌నీ ఓ సినిమాలో అతిగా ఆశపడేటోళ్లు బాగుపడినట్లు చరిత్రలో లేదని చెప్పిన రీల్ డైలాగ్ ఇప్పుడు త‌మిళ పాలిటిక్స్‌లో రియ‌ల్ అయ్యేట‌ట్లుంది.

త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మృతిచెందిన త‌ర్వాత త‌మిళ రాజ‌కీయాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. జ‌య ఉన్న‌ప్పుడు అమ్మ తర్వాత చిన్నమ్మే అన్న‌ట్టు ఉండేది. అమ్మ మృతి త‌ర్వాత ఇప్పుడు ఆ మాట రోజు రోజుకు మ‌రుగున ప‌డుతుందా ? చిన్న‌మ్మ‌కు గ‌ట్టి పోటీగా వ్య‌తిరేక వ‌ర్గం పావులు క‌దుపుతుందా ? అంటే అవున‌నే ఆన్స‌రే త‌మిళ‌నాడు విన‌వ‌స్తోంది.

జయ మృతి త‌ర్వాత ప‌న్నీర్ సెల్వంను కేంద్రం ఆఘ‌మేఘాల మీద సీఎం చేసింది. ఆ త‌ర్వాత ఆయ‌న మోడీని సైతం క‌లిసివ‌చ్చారు. రోజు రోజుకు స్ట్రాంగ్ అవ్వ‌డంతో పాటు పార్టీలోను, ప్ర‌భుత్వంలోను ప‌ట్టు సాధిస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోను ప‌న్నీర్‌ను ప‌క్క‌న పెట్టి సీఎం అయిపోవాల‌ని స్పీడ్‌గా ఉన్న శ‌శిక‌ళ దూకుడుకు బ్రేకులు ప‌డుతున్నాయి.

త‌మిళ‌నాట అన్నాడీఎంకే నేత‌లు ఇప్పుడు కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. శ‌శిక‌ళ‌కు కాకుండా సీఎం పన్నీరు సెల్వానికే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా బ్యాన‌ర్లు క‌డుతున్నారు. నిన్న‌టి వ‌ర‌కు అంద‌రి నోట‌ చిన‌మ్మే అన్న‌మాట త‌ప్ప మ‌రోమాట రాలేదు. ఇప్పుడు నెమ్మ‌ది నెమ్మ‌దిగా ప‌న్నీర్ సెల్వంను పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా చేయాల‌ని ప‌లు జిల్లాల్లో బ్యాన‌ర్లు వెల‌స్తున్నాయి. ఇదంతా ప‌న్నీర్ స్కెచ్‌తోనే జ‌రుగుతోందా ? అన్న సందేహాలు కూడా వ‌స్తున్నాయి.

ఇదిలా ఉంటే అమ్మ మృతి త‌ర్వాత ఆమె నెచ్చెలి శ‌శిక‌ళ దూకుడుగా వ్య‌వ‌హ‌రించి, పార్టీపై ప‌ట్టు సాధించ‌డం, పోయ‌స్ గార్డెన్‌లోకి వెంట‌నే ఎంట్రీ ఇవ్వ‌డం, అమ్మ దూరం పెట్టిన త‌న ఫ్యామిలీని మొత్తం అక్క‌డ దించేయ‌డం … పార్టీ ఎమ్మెల్యేల‌తో తాను సీఎం అవ్వాల‌నుకుంటున్నట్టు త‌న మ‌న‌స్సులో మాట కూడా చెప్ప‌డం ఇవ‌న్నీ ఆమెకు మైన‌స్‌గా మారాయి. శ‌శిక‌ళ విష‌యంలో ర‌జనీకాంత్ చెప్పిన‌ట్టు అతిగా ఆశ‌ప‌డేవాళ్లు చ‌రిత్ర‌లో బాగుప‌డిన‌ట్లు లేద‌న్న డైలాగ్ ఆమెకు క‌రెక్ట్‌గా సూట్ అయ్యింద‌న్న టాక్ త‌మిళ పాలిటిక్స్‌లో వినిపిస్తోంది.