ఆ ప్ర‌శ్న‌తో చంద్ర‌బాబుకు దిమ్మ తిరిగింది     2017-01-11   23:24:32  IST  Bhanu C

మీడియా మేనేజ్‌మెంట్‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబును మించిన నేత ఎవ‌రూ లేరంటే అతిశయోక్తి కాదేమో! ఎందుకంటే తాను ఏ ప‌ని చేసినా.. మీడియా అటెన్ష‌న్ అంతా తన చుట్టూ ఉండేలా చూసుకుంటారు. అలాగే మీడియా ప్ర‌తినిధులు త‌న‌ను ఇబ్బంది పెట్టే ప్ర‌శ్న వేసినా దానికి త‌డ‌బ‌డ‌కుండా త‌న‌దైన శైలిలో స‌మాధానం చెబుతూ ఉంటారు. అయితే ఎప్పుడూ ప‌రిస్థితులు అనుకూలంగా ఉండవు క‌దా! ఇండియా టుడే స‌ద‌స్సులో ప్ర‌ముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ స‌ర్దేశాయ్ నుంచి బాబుకు ఊహించ‌ని ప్ర‌శ్న ఎదురైంది. దీంతో ఆయ‌న‌కు ఒక్క‌సారిగా దిమ్మ‌తిరిగిపోయింది. ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పేందుకు బాబు కొంత త‌డ‌బ‌డ్డారు.

మీడియా విషయంలో చంద్ర‌బాబుకు కావ‌ల‌సినంత స్వేచ్ఛ ఉంది. ఒక‌టి రెండు మిన‌హా మిగిలినవ‌న్నీ ఆయ‌నకు అనుకూలంగా ఉండేవే! అన్ని చోట్లా చంద్ర‌బాబు మ‌న‌సెరిగి ప్ర‌శ్నించేవారు ఉండ‌రు క‌దా. వాస్త‌వాల‌ను ప్ర‌స్తావించేవారు కూడా ఉంటారు క‌దా. స‌రిగ్గా అలాంటి ఓ సంద‌ర్భ‌మే చంద్రబాబును ఇర‌కాటంలో ప‌డేసింది. ఢిల్లీలో జ‌రిగిన `ఇండియా టుడే` స‌ద‌స్సులో కేంద్ర‌మంత్రి వెంక‌య్య స‌హా ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. దీనికి రాజ్‌దీప్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇందులో ఆయ‌న చంద్రబాబుతో మాట్లాడుతూ కొన్ని ప్ర‌శ్న‌లు వేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ఒక మోడ‌ల్ స్టేట్‌గా మార్చుతాన‌నీ, టెక్నాల‌జీ వినియోగంతోపాటు అవినీతి నిర్మూల‌న‌కు కృషి చేస్తామ‌ని చంద్ర‌బాబు అన్నారు. దీనిపై రాజ్‌దీప్ఓ ప్ర‌శ్న వేశారు. ‘అవినీతిని అంత‌మొందిస్తామంటున్నారు… మరి, ఏపీలో ప్ర‌తిప‌క్ష‌ ఎమ్మెల్యేల‌ను కొంటున్నారంటూ ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి క‌దా! బ్రేక్ పార్టీ, మేక్ పార్టీ అన్న‌ట్టుగా రాష్ట్రాన్ని పున‌ర్మిస్తారా?’ అనే స‌రికి బాబు ముఖం మారిపోయింది.

దానికి సూటిగా స‌మాధానం చెప్ప‌కుండా… టీడీపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్న‌ప్పుడు ఎమ్మెల్యేల‌ను కొనాల్సిన అవ‌సర‌మేంట‌ని స‌మాధానం చెప్పారు. టీడీపీని అభిమానించేవారు, త‌న‌పై న‌మ్మ‌కంతో వెంట వ‌స్తున్నార‌ని ఆయ‌న స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేశారు. రాజ‌ధాని భూసేక‌ర‌ణ అద్భుతంగా జ‌రుగుతోంద‌నీ, అవినీతి ర‌హితంగానే అమ‌రావతి నిర్మిస్తున్నామ‌ని చెప్పారు.