ఏపీలో ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు విస్తృతంగా దూసుకుపోతున్నాయి.అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలలో గెలుపే లక్ష్యంగ దూసుకుపోతూ ఉంటే, ప్రత్యామ్నాయంగా ఏర్పడిన జనసేన పార్టీ కూడా ఎలా అయిన తమ సత్తా చూపించాలని గట్టిగ ప్రయత్నం చేస్తున్నాయి.
అయితే ఏపీ విభజన పాపాన్ని అంటించుకొని జాతీయ పార్టీ కాంగ్రెస్ కనీసం పోటీ ఇచ్చే పరిస్థితిలో కూడా ఏపీలో లేదు.అయిన కూడా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే మూడు సార్లు వచ్చాడు మూడు సార్లు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు.
తాజాగా విజయవాడలో కాంగ్రెస్ పార్టీ భరోసా యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏపీ ప్రజలని కేంద్రం ఎలా మోసం చేసిందో చెబుతూనే ఏపీని విభజించినపుడు ఇచ్చిన మాట ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని, కాంగ్రెస్ గెలిచినా వెంటనే ఏపీ ప్రత్యేకహోదా మీద మొదటి సంతకం చేస్తామని, పార్టీ మేనిఫెస్టోలో కూడా ప్రత్యేక హోదాని చేర్చినట్లు చెప్పుకొచ్చారు.
కేంద్రంలో అధికారంలోకి రాగానే ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పడం ద్వారా ఏపీ ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నం రాహుల్ గాంధీ చేసారని చెప్పాలి.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేసే పరిస్థితిలో లేరు.అయిన కూడా రాహుల్ గాంధీ ఏపీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి కారణం ఏంటి అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి.అయితే ప్రస్తుతం ఏపీలో తెలుగు దేశం పార్టీ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీతో తెలుగు దేశం పొత్తు పెట్టుకుంది.అలాగే దేశ రాజకీయాలలో కూడా తెలుగు దేశం పార్టీ కాంగ్రెస్ తో జత కట్టేందుకు సిద్ధం అవుతుంది.
ఇలాంటి టైంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేసిన అది టీడీపీకి అనుకూలిస్తుందని, తెలుగుదేశం పార్టీతో నేరుగా పొత్తు పెట్టుకుంటే ఏపీ ప్రజలు రెండు పార్టీలని వ్యతిరేకిస్తారని గ్రహించి ఈ పంథాలో రాహుల్ ని చంద్రబాబు వెనకుండి నడిపిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.