కేసీఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌ ప్లాన్‌ను రాహుల్‌ దెబ్బ కొట్టాడు!       2018-06-22   05:39:06  IST  Bhanu C

దేశ రాజకీయాల్లో ప్రస్తుతం ఎన్డీయే మరియు యూపీకే కూటములు మాత్రమే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. 2014 ముందు వరకు యూపీఏ అధికారంలో ఉండగా, ప్రస్తుతం ఎన్డీయే అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకు గట్టి పోటీ ఇచ్చేందుకు యూపీఏ కూటమి ప్రయత్నాలు చేస్తుంది. ఎన్డీయేలో బీజేపీ ప్రధాన పార్టీ కాగా, యూపీఏలో కాంగ్రెస్‌ ప్రధాన పార్టీ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రెండు కూటములు కూడా దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నాయి. అయితే కొన్ని పార్టీలు మాత్రం ఈ రెండు ప్రధాన పార్టీలకు దూరంగా ఉంటున్నాయి. ఆ పార్టీలు థర్డ్‌ ఫ్రంట్‌ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి.

దేశంలో ప్రస్తుతం థర్డ్‌ ఫ్రంట్‌ అవసరం చాలా ఉందని, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా తాము కూటమిని ఏర్పాటు చేస్తాం అంటూ కేసీఆర్‌ ప్రకటించాడు. దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు తాను ముందు ఉండి నడుస్తాను అని, తనతో ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా నడుస్తారనే నమ్మకంను వ్యక్తం చేశాడు కేసీఆర్‌. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలుతో పాటు, రైతులకు అండదండగా నిలవడం వంటివి చేస్తున్నాం అని, ఆ పథకాలను దేశ వ్యాప్తంగా ప్రచారం చేసి, కేంద్రంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని కేసీఆర్‌ భావించారు.

సీఎం కేసీఆర్‌ తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి, అక్కడ ప్రాంతీయ పార్టీలతో భేటీలు నిర్వహించాడు. కేసీఆర్‌ జోరు చూసి కొందరు 2019 ఎన్నికల్లో కేసీఆర్‌ ఫ్రంట్‌కు ఖచ్చితంగా 200 నుండి 250 ఎంపీ స్థానాలు దక్కుతాయనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. కాని ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. కేసీఆర్‌ స్పీడ్‌ను అడ్డుకుంటూ రాహుల్‌ గాంధీ అనూహ్యంగా నిర్ణయాలు తీసుకుని థర్డ్‌ ఫ్రంట్‌ను ఆదిలోనే దెబ్బ కొట్టేశాడు.

2019 ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచే ప్రాంతీయ పార్టీలన్నింటికి వారి రాష్ట్రంలో సీఎం అభ్యర్థిగా వారికే అవకాశం ఇస్తామంటూ ప్రకటించారు. దాంతో కేసీఆర్‌కు వెన్నంటి ఉంటాం అంటూ హామీ ఇచ్చిన పలువురు రాష్ట్ర నేతలు ఇప్పుడు రాహుల్‌ గాంధీ వెంట నడిచేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా ప్రకటించారు. థర్డ్‌ ఫ్రంట్‌ విషయమై ఇక చర్చలు అనవసరం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు కూడా థర్డ్‌ ఫ్రంట్‌ పై ఆశలు లేవని, అందుకే మోడీతో భేటీ అయ్యి, బీజేపీతో మచ్చికగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.