మహేష్‌ 25లో పీవీపీకి కూడా చోటు       2018-05-25   00:48:58  IST  Raghu V

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుతో ‘బ్రహ్మోత్సవం’ చిత్రాన్ని నిర్మించిన ప్రసాద్‌ వి పొట్లూరి భారీగా నష్టపోయాడు. ఆ సినిమా తర్వాత నష్టంను పూర్తి చేసేందుకు ఆయన బ్యానర్‌లో మరో సినిమాను చేసేందుకు మహేష్‌బాబు అంగీకారం చెప్పాడు. దాంతో మహేష్‌ కోసం వంశీ పైడిపల్లికి అడ్వాన్స్‌ ఇచ్చి మరీ కథను సిద్దం చేయించాడు. మహేష్‌బాబుకు నచ్చిన కథను వంశీ రెడీ చేశాడు. త్వరలో సినిమా ప్రారంభించాలని ప్రసాద్‌ వి పొట్లూరి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో మహేష్‌బాబు, వంశీలు అదే ప్రాజెక్ట్‌ను దిల్‌రాజు, అశ్వినీదత్‌ల సంయుక్త నిర్మాణంలో చేయాలని ఫిక్స్‌ అయ్యారు.

తాను చేయాలనుకున్న మూవీని వారికి ఎలా ఇస్తారంటూ నిర్మాత ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మాతల మండలని ఆశ్రయించాడు. దర్శకుడు వంశీ పైడిపల్లి మరియు మహేష్‌బాబులపై పీవీపీ ఫిర్యాదు చేశాడు. ఇదే విషయం కోర్టు వరకు కూడా వెళ్లింది. దాంతో మహేష్‌బాబు 25వ చిత్రంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈమద్య ఆ విషయమై కాస్త సైలెంట్‌ అయ్యింది. ప్రసాద్‌ వి పొట్లూరి సైలెంట్‌ ఎలా అయ్యాడు, ఆయన్ను ఏం చెప్పి ఒప్పించారు అంటూ అందరు చర్చించుకుంటున్నారు. తాజాగా ఆ విషయమై ఒక క్లారిటీ వచ్చింది.

మహేష్‌బాబు 25వ సినిమాను దిల్‌రాజు, అశ్వినీదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరితో పాటు పీవీపీని కూడా మహేష్‌బాబు చేర్చాడు. తన 25వ సినిమా నిర్మాణంలో పీవీపీని భాగస్వామిని చేయడంతో ఈ వివాదంకు మహేష్‌బాబు ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లుగా తొస్తోంది. 2018లో పీవీపీ బ్యానర్‌కు మహేష్‌బాబు ఒక సినిమా చేయాల్సి ఉంది. అది ఇలా కూడా కలిసి వస్తుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే మహేష్‌ తీసుకున్న నిర్ణయం నిర్మాతలు దిల్‌రాజు, అశ్వినీదత్‌లకు కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. అయినా కూడా మహేష్‌ కోసం వారు సరే అన్నట్లుగా తెలుస్తోంది.

‘బ్రహ్మోత్సవం’ సినిమాతో నష్టాలపాలైన పీవీపీని ఆదుకునేందుకు మహేష్‌బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దాంతో పాటు లీగల్‌ ఇబ్బందులు ఎదుర్కొనేందుకు మహేష్‌బాబు ఆసక్తిగా లేడు. ఆ కారణంగా కూడా పీవీపీని ఇందులో భాగస్వామిని చేయాలని నిర్ణయించుకున్నాడు. భారీ అంచనాల నడుమ తెరకెక్కబోతున్న మహేష్‌బాబు 25వ చిత్రం మరి కొన్ని రోజుల్లో సెట్స్‌ పైకి వెళ్లబోతుంది. మహేష్‌ కెరీర్‌లో నిలిచి పోయే చిత్రంలా ఈ చిత్రంను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఆయన ప్రయత్నం సఫలం అయ్యేనా చూడాలి.