చిత్రం : ఇజం
బ్యానర్ : యన్.టి.
ఆర్ ఆర్ట్స్
దర్శకత్వం : పూరి జగన్నాథ్
నిర్మాత : కళ్యాణ్ రామ్
సంగీతం : అనూప్ రుబెన్స్
విడుదల తేది : అక్టోబర్ 21, 2016
నటీనటులు : కళ్యాణ్ రామ్, జగపతిబాబు, అదితి ఆర్య, ఆలీ తదితరులు
పటాస్ లాంటి భారీ బ్లాకబస్టర్ తరువాత షేర్ లాంటి భారీ ఫ్లాప్ ని అందుకున్నాడు కళ్యాణ్ రామ్.మరోవైపు పూరి జగన్నాథ్ టైమ్ కూడా ఒక హిట్టు, ఇక ఫట్టు అన్నట్లుగా నడుస్తోంది.
ఇలాంటి సమయంలో ఇద్దరి కెరీర్ కి కీలకంగా మారిన “ఇజం” ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళ్తే …
స్ట్రీట్ ఫైటర్ అయిన కళ్యాణ్ రామ్, అలియా ఖాన్ (అదితి ఆర్య) ని ప్రేమలో పడేస్తుంటాడు.
ఈ ఆలియా ఖాన్ ఎవరో కాదు ఇంటర్నేషనల్ డాన్ జావెద్ భాయ్ (జగపతి బాబు) కూతురు.అల్లరిచిల్లరగా కనిపిస్తున్న కళ్యాణ్ రామ్ నిజానికి వికిలిక్స్ తరహాలో ఒక లీకేజ్ వెబ్ సైట్ నడుపుతుంటాడు.
అసలు ఇతని అసలు పేరు ఏంటి ? ఎవరెవరిని టార్గేట్ చేసి లీకేజ్ వెబ్ సైట్ నడుపుతున్నాడు? కథానాయకుడి ఆశయం ఏంటి ? ఇవన్ని తెర మీదే చూడాలి.
నటీనటుల నటన గురించి
హీరోల ఆటిట్యూడ్, ఆహార్యం, డైలాగ్ డిక్షన్ అన్ని మార్చేయడంలో పూరి జగన్నాథ్ ని మించిన వారు లేరు.
ఈ విషయం మరోసారి నిరూపితమైంది.కళ్యాణ్ రామ్ ఇదివరకు చేసిన సినిమాలకి అసలు సంబంధం, పోలిక లేని కాస్ట్యూమ్స్, డైలాగ్ డెలివరి, బాడి లాంగ్వేజ్ తో కళ్యాణ్ రామ్ అదరగొట్టేశాడు.
దర్శకుడు ముందుగానే చెప్పినట్లు, కోర్టు సీన్ లో కళ్యాణ్ రామ్ చేసిన నటన, ఈ ఏడాది టాప్ పెర్ఫార్మెన్స్ గా నిలిపోవచ్చు.ఇజం సినిమా ఫలితంతో సంబంధం లేకుండా, తన కెరీర్ ని కొత్త పంథాలోకి తీసుకెళ్ళే సినిమా.
కళ్యాణ్ రామ్ కి నటుడిగా ఇదే బెస్ట్ ఇప్పటివరకు.
అదితి ఆర్య మాజి ఫేమినా వరల్డ్ విజేత.
తన అందం గురించి, స్క్రీన్ ప్రెసెన్స్ గురించి అస్సలు కంప్లయింట్స్ లేవు కాని, రాని భాష సెట్లో పలకడానికి, అర్థం అయ్యి, కాని సంభాషణలకి కరెక్ట్ గా హావభావాలు పెట్టడానికి తీవ్రంగా ఇబ్బందిపడింది.జగపతి బాబు మిగితా సినిమాల్లో లాగే ఇందులోనూ కనబడ్డారు.
పూరి మార్క్ ఆటిట్యూడ్ ఎలాగో ఉంది కాని ఈ పాత్ర కోసం డైలాగ్ డెలివరీ కాస్త మార్చుకోవాల్సింది.పాత్ర కూడా ఆశించిన రీతిలో పండలేదు.
మిగితావారి గురించి పెద్దగా మాట్లాడడానికి ఏమి లేదు.
సాంకేతికవర్గం పనితీరు
సినిమాటోగ్రాఫి డిపార్టుమెంటు వరకు పూరి జగన్నాథ్ సినిమాలు ఎప్పుడు టాప్ లో ఉంటాయి.
ఇజం కూడా అంతే.ముకేష్ అందించిన ఛాయగ్రాహణం బాగుంది.
అనూప్ అందించిన పాటలు గుర్తుపెట్టుకోవడం కష్టం.అయితే నేపథ్య సంగీతం బాగుంది.
చాలా సన్నివేశాల్ని బాగా ఎలివేట్ చేశాడు అనూప్.కోర్టు సీన్లో ఎడిటర్ వర్క్ చాలా బాగుంది.
మిగితా చోట్ల ఫర్వాలేదు.సెకండాఫ్ మీద ఇంకాస్త వర్క్ చేయాల్సింది.
నిర్మాణ విలువలు అదరహో.కష్టంతో పాటు డబ్బు కూడా బాగా పెట్టేసాడు కళ్యాణ్ రామ్.
విశ్లేషణ
వీకిలీక్స్ తరహా కథని తెలుగు సినిమా కోసం ఎంచుకుంటారని మనం ఎప్పుడూ అనుకోలేదు.అలాంటి ఐడియాని ప్రయోగించటం పూరి జగన్నాథ్ కాకుండా మరొకరు చేసుండేవారు కారేమో.
స్టోరీ లైన్ బాగున్నా, ట్రీట్‌మెంట్, అటు బాగుంది అనలేకుండా, ఇటు బాగాలేదు అనుకోకుండా, పూరి మార్క్ వలన ఒక యనివర్సల్ ఆడియెన్స్ ఉండే ఐడియా యావరేజ్ సినిమాగా మారిందేమో అని అనిపిస్తుంది.బలమైన పాత్రలు లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్.
అలాగని ఉన్న బడ్జెట్ తో ఈ తరహా కథని క్లాసిక్ గా తీయడం కూడా కష్టం ఏమో.హ్యాకింగ్ ఎపిసోడ్లు ఎదో అలా సాగిపోతాయి.పూరి మాటలు తూటాల్లా పేలాయి.కొన్ని డైలాగులు వింటే సెన్సార్ నుంచి ఇవి తప్పించుకున్నాయి అంటే గొప్ప విషయమే అనిపిస్తుంది.డైలాగ్ రైటర్ గా ఫేల్ అవలేదు పూరి, డైరెక్టర్ గా మాత్రం కొత్తదైన మార్క్ చూపెట్టలేకపోయారంతే.
అలాగని ఇజం పూర్తిగా చూడకుండా వదిలేసే సినిమా కూడా కాదు.
బాగుంది – ఫర్వాలేదుకి మధ్య సెటిల్ అయ్యే సినిమా.కొన్ని సన్నివేశాలు విసుగ్గా, కొన్ని సన్నివేశాలు ఈలలు వేయాలనిపించేలా ఉంటాయి అంతే.
హైలైట్స్ :
* కళ్యాణ్ రామ్
* కోర్టు సీన్, మరికొన్ని సన్నివేశాలు
* డైలాగ్స్
డ్రాబ్యాక్స్ :
* విలన్ పాత్ర
* ఒకటి రెండు సన్నివేశాలు మినహా ఆసక్తిగా లేని సెకండాఫ్.
* కథకి పూరి ఇచ్చిన ట్రీట్‌మెంట్
చివరగా :
ఒక్కసారి .పూరి మాటల కోసం, కళ్యాణ్ రామ్ నటన కోసం.