బాబు.. ఓ 5 యేళ్లు ఆగు       2018-05-15   04:26:43  IST  Raghu V

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలు వచ్చాయి. అయితే అదంతా గతం, ప్రస్తుతం పూర్తి విరుద్దంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా సరైన సక్సెస్‌లు పూరికి దక్కడం లేదు. పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్‌ ముందు బొక్క బోర్లా పడుతూ వస్తుంది. అయినా కూడా ఏమాత్రం నమ్మకం కోల్పోకుండా దర్శకుడు పూరి తన ప్రతిభపై నమ్మకంతో తన కొడుకును హీరోగా పరిచయం చేస్తూ ‘మెహబూబా’ చిత్రాన్ని స్వయంగా నిర్మించాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి దారుణమైన టాక్‌ను దక్కించుకుంది. 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఆ చిత్రం కనీసం మూడు కోట్ల వసూళ్లను రాబట్టలేని పరిస్థితి నెలకొంది.

‘మెహబూబా’కు ఈ పరిస్థితి రావడానికి కారణం చాలా మైనస్‌లు సినిమాలో ఉన్నాయి. అందులో మొదటిది పూరి తన మార్క్‌తో సినిమా తెరకెక్కించలేదు. రెండవది హీరోయిన్‌ ఆకట్టుకోలేక పోయింది. మూడవ విషయం ఏంటీ అంటే హీరోగా పూరి ఆకాష్‌ మెప్పించలేదు. గతంలో పలు చిత్రాల్లో ఆకాష్‌ను బాల నటుడిగా చూడటం జరిగింది. ఆ కారణంగానే పూరిని ఇప్పుడు హీరోగా చూడలేక ప్రేక్షకులు కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఆకాష్‌లో ఇంకా చిన్న పిల్లాడినే ప్రేక్షకులు చూస్తున్నారు. ఆకాష్‌ మరో సినిమా చేసినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అందుకే ఆకాష్‌ కాస్త గ్యాప్‌ తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ప్రేక్షకులకు కనిపించకుండా పూర్తిగా అయిదు సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగా పూరి ఆకాష్‌ ఉండాలని కొందరు సూచిస్తున్నారు. అప్పుడే ఆకాష్‌ ఒక బాలనటుడు అనే అభిప్రాయం నుండి ప్రేక్షకులు బయట పడతారు. ఎప్పుడు కనిపిస్తూనే ఉంటే పెరుగుదలలో మార్పు కనిపించదు అనే విషయం తెల్సిందే. అలాగే ఆకాష్‌ పెరుగుతున్నప్పటికియ ఆయన్ను ఎప్పుడు చూస్తూ ఉండటం వల్ల ఆ పెరుగుద అనేది ప్రేక్షకులు గమనించకుండా ఇంకా చిన్న పిల్లాడే అనే అభిప్రాయంలో ఉన్నారు. అందుకే కనీసం అయిదు సంవత్సరాల పాటు పూర్తిగా కనిపించకుండా పోతే అప్పుడు ఆకాష్‌ను పెద్దయ్యాడు అని అంతా భావిస్తారని కొందరు భావిస్తున్నారు.

‘మెహబూబా’ చిత్రం విడుదలైన వెంటనే తన కొడుకుతో తానే రెండవ సినిమా తీస్తాను అంటూ పూరి జగన్నాధ్‌ గతంలో ప్రకటించాడు. అయితే మొదటి సినిమా ఫలితంతో రెండవ సినిమాకు వెనుకంజ వేసే అవకాశం ఉంది. ఇప్పట్లో పూరి జగన్నాధ్‌ సినిమా చేస్తాడని ఏ ఒక్కరు భావించడం లేదు. ఆయన ఆర్థికంగా చితికి పోయాడు కనుక సొంత నిర్మాణం కష్టం. ఇక ఇతర బ్యానర్‌లో సినిమాలు చేయాలి అంటే ప్రస్తుతానికి ఏ ఒక్క నిర్మాత ఆసక్తి చూపించే పరిస్థితి లేదు. అందుకే తన తండ్రి మళ్లీ ఫాంలోకి వచ్చే వరకు ఆకాష్‌ కనిపించకుండా పోతే అన్ని విధాలుగా బాగుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.