బాబు నటిస్తున్నాడా ..? బీజేపీ అలా ఎందుకు అంటోంది....?       2018-06-26   21:46:57  IST  Bhanu C

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద బీజేపీకి పీకల్లోతు కోపం ఉన్నట్టు ఉంది. అందుకే అవకాశం దొరికితే చాలు ఆయన్ను చెడామడా తిట్టేస్తూ ఇష్టం వచ్చినట్టు బెదిరించేస్తున్నారు. మొన్నటివరకు నోట్లో బెల్లం పెడితే కొరకలేనట్టుగా ఉన్న ఏపీ బీజేపీ నేతలు సైతం బాబు పై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా ఏపీ బీజేపీ నేత దగ్గుపాటి పురంధరేశ్వరి బాబుపై తీవ్ర స్థాయిలో బెదిరింపులతో కూడిన విమర్శలు చేసారు.

చంద్రబాబు నాయుడికి నిజం చెప్పడం రాదు.. నాకు అబద్దం చెప్పడం రాదు అని విమర్శించారు. నిద్రపోతున్న వారిని లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్లు నటిస్తున్న చంద్రబాబు వంటి వారిని లేపటం తమ వల్ల కాదని ఆమె వ్యాఖ్యానించారు. పురంధేశ్వరి. విజయవాడలో జరిగిన మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా ఏపీకి కేంద్రం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెప్తూ టీడీపీ పై విమర్శల బాణాలు వదిలారు.

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అడ్డుపడుతోందని టీడీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తూ… కేంద్రంపై బురదజల్లడం సరికాదన్నారు. పాతరేట్లకే ప్రాజెక్టు పనులు చేయించింది కేంద్రమంత్రి గడ్కరీయే అన్నారు. వచ్చే వేసవికాలం నాటికి పోలవరం పూర్తి చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. కేంద్రం ఈ ప్రాజెక్టును బాధ్యతగా తీసుకుందని, కాబట్టి సమీక్షించాల్సిన బాధ్యత తమపైన ఉందన్నారు. పోలవరానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని.. నూటికి నూరుశాతం కేంద్రం నిధులతో ఈ ప్రాజెక్టును కడుతున్నారని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. దాదాపు రూ.16వేల కోట్ల ప్రాజెక్టు వ్యయాన్ని నూరుశాతం కేంద్రమే భరిస్తోందన్నారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం చిత్తశుద్ధికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు. బీజేపీ రాష్ట్ర నేతల బృందం పోలవరం క్షేత్ర పర్యటనకు వెళ్లినపుడు పరిహారం విషయంలో అక్రమాలు జరిగాయని నిర్వాసితులు ఆరోపించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. వైసీపీ ఎంపీల రాజీనామాల్ని డ్రామాలుగా చెబుతున్న టీడీపీ నేతలు. ఏపీలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారి రాజీనామాలు ఇంకా స్పీకర్ వద్ద ఎందుకు పెండింగ్‌ లో ఉన్నాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

జమిలీ ఎన్నికల ద్వారా ఎన్నికల ఖర్చు తగ్గటంతో పాటు అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడకూడదనే బీజేపీ ఆలోచిస్తోందని పురంధరేశ్వరి చెప్పుకొచ్చారు. టీడీపీ ఎన్ని విమర్శలు చేసినా బీజేపీ బెదరదని .. చంద్రబాబు అవినీతి వ్యవహారాలను బయటపెట్టి ప్రజలకు తెలియజెప్పుతామని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకుల దూకుడు చూస్తుంటే బాబుని ఇరకాటంలో పెట్టేందుకు గట్టిగానే ట్రై చేస్తున్నట్టు అర్ధం అవుతోంది.