పెద్ద చిత్రాలకు భయపడుతున్న సురేష్‌బాబు!       2018-07-01   23:57:14  IST  Raghu V

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతల్లో సురేష్‌బాబు ఒకరు. ఈయన తండ్రి రామానాయుడు స్థాపించిన సురేష్‌ ప్రొడక్షన్స్‌ 50 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. అప్పట్లో భారీ చిత్రాలకు పెట్టింది పేరుగా నిలిచిన సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రస్తుతం చిన్న చిత్రాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. రామానాయుడు చివరి రోజుల్లో కూడా ఎక్కువ చిన్న చిత్రాలను నిర్మించేందుకు ఆసక్తి చూపించారు. చిన్న చిత్రాలు నిర్మించడం వల్ల టెన్షన్‌ ఉండదు అని రామానాయుడు చెబుతూ ఉండేవారు. అయితే సురేష్‌బాబు కూడా ఆ టెన్షన్‌ను తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

ఈమద్య కాలంలో సురేష్‌బాబు నిర్మించిన చిత్రాలు అన్ని కూడా దాదాపు 10 కోట్ల బడ్జెట్‌లోపు చిత్రాలే అని చెప్పుకోవచ్చు. తాజాగా సురేష్‌ ప్రొడక్షన్స్‌లో వచ్చిన ‘ఈ నగరారిని ఏమైంది’ చిత్రం 6 కోట్ల వ్యయంతో తెరకెక్కినట్లుగా తెలుస్తోది. ఇలా చిన్న బడ్జెట్‌ చిత్రాలను నిర్మించడం, ఎక్కువగా లాభాలను దక్కించుకోవడం ఈయన చేస్తున్నాడు. దాంతో పెద్ద చిత్రాలను సురేష్‌బాబు నిర్మించేందుకు ఆసక్తి చూపడం లేదు. మహా అయితే 20 కోట్ల వరకు సినిమాలకు కేటాయించాలి తప్ప అంతకు మించి ఖర్చు చేయవద్దు అనేది సురేష్‌బాబు పాలసీగా కనిపిస్తుంది.

తాజాగా అదే విషయమై సురేష్‌బాబు మాట్లాడుతూ తమ కుటుంబం నుండి వరుసగా చిత్రాలు చేయాలని భావిస్తున్నాను. అయితే కొన్ని కారణాల వల్ల అది సాధ్యం అవ్వడం లేదు. ఇతర స్టార్‌ హీరోలతో సినిమాలు చేసేందుకు ఆసక్తి లేదు. ఇతర స్టార్‌ హీరోలతో సినిమాలు అంటే భారీ బడ్జెట్‌తో చేయాల్సి ఉంటుంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ను నాలుగు కాలాల పాటు నిలపడం తన భాద్యత. అందుకే చిన్న చిత్రాలకు ప్రాముఖ్యత ఇస్తూ, భారీ చిత్రాల నిర్మాణంకు ఆసక్తి చూపడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.

భారీ చిత్రాలను నిర్మిస్తే, రెండు మూడు చిత్రాలు ఫ్లాప్‌ అయితే మళ్లీ కోలుకోలేని విధంగా పరిస్థితి మారుతుంది. అందుకే పెద్ద చిత్రాల కంటే చిన్న చిత్రాల వల్లే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండవచ్చు అని, నాలుగు కాలాల పాటు ఉండాలి అంటే ఖచ్చితంగా చిన్న చిత్రాలను నిర్మించినప్పుడు మాత్రమే ఉండగలం అంటూ సురేష్‌బాబు తన అనుభవంతో చెబుతున్నాడు. చిన్న చిత్రాలు నిర్మిస్తూనే అప్పుడప్పుడు పెద్ద చిత్రాలు నిర్మించాలని ఉన్నా కూడా సమయం, అవకాశం కుదరడం లేదు అంటూ సురేష్‌బాబు చెప్పుకొచ్చాడు. సురేష్‌బాబు త్వరలో 100 కోట్లతో గుణశేఖర్‌ దర్శకత్వంలో హిరణ్య కశ్యప చిత్రంను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ వంద కోట్ల బడ్జెట్‌ చిత్రాన్ని సొంతంగా నిర్మిస్తాడా లేదంటే మరెవరైన భాగస్వామితో సినిమాను సురేష్‌బాబు నిర్మిస్తాడా అనేది చూడాలి.