కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా లక్షలాది మంది రైతులు గత రెండు నెలలుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డేని పురస్కరించుకుని రైతులు ట్రాక్టర్ ర్యాలీకి పిలుపునిచ్చారు.
అన్నదాతల ఆందోళనకు తొలి నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు వివిధ దేశాల్లోని ఎన్ఆర్ఐలు.ముఖ్యంగా పంజాబ్, హర్యానాలకు చెందిన ప్రవాస భారతీయులు ఆయా దేశాల్లో ర్యాలీలు, ధర్నాలు చేయడంలో ముందుంటున్నారు.
తాజాగా ట్రాక్టర్ ర్యాలీకి మద్ధతుగా అమెరికాలో ఖలిస్తాన్ మద్దతుదారులు రోడ్డెక్కారు.దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు.
వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయాన్ని ముట్టడించి.ఆందోళనలను నిర్వహించారు.ప్లకార్డులు, ఖలిస్తాన్ జెండాలను ప్రదర్శించారు.అటు న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం వద్దా నిరసనలను చేపట్టారు.
మన్‌హట్టన్, చికాగో, న్యూయార్క్, సిటీ, ఫిలడెల్ఫియా వంటి ప్రాంతాల్లోనివసిస్తోన్న సిక్కు వర్గానికి చెందిన రైతులు ఈ ఆందోళనల్లో భారీగా పాల్గొన్నారు.అయితే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సెలవు ప్రకటించడంతో ఖలిస్తాన్ మద్దతుదారులు ఆందోళనలు చేపట్టిన సమయంలో అధికారులు, ఉద్యోగులెవరూ భారత రాయబార కార్యాలయంలో లేరు.
కానీ దాదాపు 5 గంటల సేపు ఆందోళనకారులు రాయబార కార్యాలయం వద్దే తమ నిరసనలను కొనసాగించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొండి వైఖరిని విడనాడాలని, రైతాంగానికి వ్యతిరేకంగా రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలను శాశ్వతంగా రద్దు చేయాలంటూ ఖలిస్తాన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలకు చెందిన సిక్కు రైతాంగానికి ఈ మూడు వ్యవసాయ బిల్లులు శాపంలా పరిణమించాయని వారు ఆరోపించారు.కొత్త వ్యవసాయ చట్టాల వల్ల సిక్కు సామాజిక వర్గానికి చెందిన రైతులు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయ చట్టాలను భారత ప్రభుత్వం శాశ్వతంగా రద్దు చేసేంత వరకూ తమ ఉద్యమం ఆగదని ఖలిస్తాన్ ప్రతినిధులు హెచ్చరించారు.
మరోవైపు ఢిల్లీలో రైతులు పిలుపునిచ్చిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది.
కేంద్రంపై ఆగ్రహంతో వున్న అన్నదాతలు రాజధానిపై దండెత్తినట్లుగా వ్యవహరించారు.బారికేడ్లను, బాష్పవాయువు గోళాలను దాటుకుంటూ ఎర్రకోటను ముట్టడించిన రైతులు కోట బురుజులపై జాతీయ పతాకంతో పాటు సిక్కుల జెండాను, రైతు సంఘాల జెండాలను ఎగురవేశారు.
తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడి చేయడంతో ఈ ఘటనలో 86 మంది పోలీసులు గాయాలపాలవ్వడంతో పాటు ఒక రైతు ప్రాణాలు కోల్పోయాడు.