చిత్రం : ప్రేమమ్
బ్యానర్ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
దర్శకత్వం : చందూ మొండేటి
నిర్మాతలు : పి.డివి.
ప్రసాద్, ఎస్.నాగవంశీ, ఎస్.రాధకృష్ణ
సంగీతం : రాజేష్ మురుగేషణ్, గోపి సుందర్
విడుదల తేది : అక్టోబరు 7, 2016
నటీనటులు : నాగచైతన్య, శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్
గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్నాడు అక్కినేని నాగచైతన్య.తనకు సక్సెస్ తెచ్చిపెట్టని యాక్షన్ సినిమాల్ని వదిలిపెట్టి, మళ్ళీ తనకు అచ్చివచ్చిన ప్రేమకథలవైపే ఆసక్తి చూపిస్తున్న చైతు, మళయాళంలో భారి విజయాన్ని సొంతం చేసుకున్న ప్రేమమ్ చిత్రాన్ని అదే పేరుతో రిమేక్ చేసాడు.
చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా అద్యంతం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం.
కథలోకి వెళ్తే …
విక్రమ్ (నాగచైతన్య), స్కూల్లో ఉండగానే సుమ (అనుపమ పరమేశ్వరన్) తో ప్రేమలో పడిపోతాడు.
కాని విక్రమ్ వన్ సైడ్ లవ్ స్టోరి సక్సెస్ ని చూడదు.ఆ తరువాత కాలేజీలో తన లెక్చరర్ సితార (శృతిహాసన్) మీద మనసు పారేసుకుంటాడు విక్రమ్.
ఈ ప్రేమకథ ఎవరు ఊహించని మలపుతో విషాదంగా ముగుస్తుంది.కొంతకాలం గడిచాక ఫేమస్ చెఫ్ గా ఎదిగిన విక్రమ్ ఓ పెద్ద రెస్టారెంట్ నడుపుతూ ఉంటాడు.
అప్పుడు తన జీవితంలోకి వస్తుంది సింధు (మడోన్నా సెబాస్టియన్).సింధు ఎవరు? విక్రమ్ జీవితంలోకి ఎలా వచ్చింది.ఈ ప్రేమకథైనా సుఖాంతాన్ని చూసిందా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటుల నటన గురించి
స్కూలుకెళ్ళే కుర్రాడి వయసు నుంచి ఓ రెస్టారెంట్ ఓనర్ గా ఎదిగేదాకా నాగచైతన్య ఒక హీరోలా కాకుండా, కథను నడిపిస్తున్న కథానాయకుడిగా కనిపించాడు.
చైతు కెరీర్లో ఇప్పటివరకు ఇదే బెస్ట్ పెర్ఫార్ఫెన్స్ అని చెప్పడానికి పెద్దగా సందేహించనక్కరలేదు.మరీముఖ్యంగా స్కులు కుర్రాడి పాత్రను ఈ వయసులో నాగచైతన్య పోషించిన తీరు నిజంగా అద్భుతం.
శృతిహాసన్ చాలా అందంగా కనిపించింది.సబ్టిల్ గా మంచి అభినయాన్ని కనబర్చింది.
అనుపమ హావభావాలు కనులను కట్టిపడేస్తాయి.అందమైన కవితలా కనబడింది తను.మడోన్నా పాత్ర పరిధిమేరలో ఫర్వాలేనిపించింది.వెంకటేష్, నాగార్జున పోషించిన అతిధి పాత్రలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలు.
ప్రవీణ్, శ్రీనివాసరెడ్డి నవ్విస్తారు.
సాంకేతికవర్గం పనితీరు
కార్తిక్ ఘట్టమనేని విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.
ముఖ్యంగా ఎవరే అనే పాటను చిత్రీకరించిన తీరు మెచ్చుకోదగ్గది.శృతిహాసన్, అనుపమ అంత అందంగా కనబడ్డారంటే, కొంచెం క్రెడిట్ సినిమాటోగ్రాఫి డిపార్ట్‌మెంట్ కి ఇవ్వాల్సిందే.
చిత్రంలో ఎక్కువగా మళయాళంలో ఉన్న బాణీలనే వాడుకున్నారు.సంగీతం బాగుంది.
రీరికార్డింగ్ కూడా ఎక్కువగా మలయాళ వెర్షన్ నుంచి స్ఫూర్తి పొందినదే.అనల్ అరసు కంపోజ్ చేసిన ఫైట్ చాలా బాగా వచ్చింది.
ఈ యాక్షన్ ఎపిసోడ్ కి మాస్ ప్రేక్షకులు ఈలలు వేయడం ఖాయం.నిర్మాణ విలువలు లావిష్ గా ఉన్నాయి.
విశ్లేషణ
ప్రేమమ్ తెలుగువారికి పూర్తిగా తెలియని కథ కాదు.రవితేజ నటించిన “నా ఆటోగ్రాఫ్” ప్రేమమ్ లాంటి కథే.అదే సినిమాకు కొంచెం పోయేటిక్ టేకింగ్, యూత్ ఫుల్ టచ్ ఇస్తే అదే ప్రేమమ్.తెలిసిన కథే అయినా, ఏం జరగబోతోంది అనే సస్పెన్స్ లేకపోయినా, ప్రేమమ్ ఎక్కడా నిరాశపర్చదు.
ఎందుకంటే తెలిసన కథను కొత్తగా చెప్పారు కాబట్టి.ముఖ్యంగా నాగచైతన్య చిత్రాన్ని నడిపించిన విధానం ప్రేక్షకులని మెప్పిస్తుంది.
ఒకటి అరా సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు కాని, మలయాళ సినిమా ఇప్పటివరకూ చూడకుండా, డైరెక్టుగా తెలుగు ప్రేమమ్ చూస్తే ఆ ఒక్క కంప్లయింట్ కూడా ఉండదు.మళయాళంలో చిత్రం స్లోగా, అక్కడి జనాలకి నచ్చేలా ఉంటుంది.
తెలుగు నేటివిటికి తగ్గట్లుగా చేసిన మార్పులు, జోడించిన హాస్యం, వెంకటేష్, నాగార్జున కామియోలు ఎక్కడా సినిమా ఫీల్ ని మాత్రం దెబ్బతీయలేదు.మొత్తంగా చెప్పాలంటే, బాక్సాఫీసు దగ్గర నాగచైతన్యకి మరో హిట్ ఈ ప్రేమమ్.
హైలైట్స్ :
* నాగచైతన్య
* హీరోయిన్లు
* సినిమాటోగ్రాఫి, సంగీతం
* ఎడిటింగ్
* నాగార్జున, వెంకటేష్ ప్రత్యేక పాత్రలు
డ్రాబ్యాక్స్ :
* ఏమోషనల్ కంటెంట్ తక్కువగా ఉండటం
* ఇదివరకే తెలిసిన కథ కావడం
చివరగా :
అలా ఓసారి హాయిగా చూడగలిగే సినిమా
తెలుగుస్టాప్ రేటింగ్
3.25/5