యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కుతూ ఉండగా ప్రభాస్ శ్రీరాముడు పాత్రలో నటిస్తున్నాడు.
సైఫ్ అలీఖాన్ రావణుడుగా, కృతి సనన్ సీతాదేవిగా నటిస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.
కంప్లీట్ మోషన్ క్యాప్చర్ విధానంలో త్రీడీలో ఈ సినిమాని దర్శకుడు ఆవిష్కరిస్తున్నాడు.టి-సిరీస్ ఏకంగా 250 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మిస్తుంది.
ఇదిలా ఉంటే దర్శకుడు ఓం రౌత్ గతంలో ప్రభాస్ ని చూసిన తర్వాత శ్రీరాముడు పాత్రకి అతను మాత్రమే సరిపోతాడని ఈ సినిమాని స్టార్ట్ చేసానని, అతను చేయనని అంటే అది పురుష్ స్టార్ట్ అయ్యేది కాదని చెప్పుకొచ్చారు.అయితే తాజాగా ఈ సినిమాలో తాను పోషిస్తున్న శ్రీరాముడు పాత్ర గురించి ప్రభాస్ మీడియాతో పంచుకున్నారు.
నిజానికి శ్రీరాముడు పాత్రలో నటించడం అంత సులభమైన విషయం కాదని, ఏవో మిగిలిన జానపథ పాత్రల తరహాలో శ్రీరాముడు పాత్రని అస్సలు ఊహించుకోలేమని చెప్పుకొచ్చాడు.
శ్రీరాముడిగా నటించడం అనుకున్నంత సులువేమీ కాదు.సవాళ్లతో కూడుకున్న ప్రయత్నమిది.రాముడి వ్యక్తిత్వాన్ని మూర్తీభవించాలంటే చాలా స్టడీ చేయాల్సి ఉంటుంది.
చాలా సినిమాల విజువల్స్ చూడవలసిన అవసరం ఉంది.శ్రీరాముడిగా కనిపించాలంటే చాలా ఆంక్షలు ఉంటాయి.
చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అతిగా తినకూడదని అన్నారు.మాయాబజార్ సినిమాకి ముందు ఎన్టీఆర్ ని శ్రీకృష్ణుడు పాత్రలో చూడటానికి ఇష్టపడలేదని, అయితే ఆ సినిమాలో ఎన్టీఆర్ చూపించిన నటన, కేవీరెడ్డి దర్శకత్వ ప్రతిభ కారణంగా తరువాత శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ అనేంత గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు.
ఇక ఈ పాత్రలో నటించడంలో ఉన్న సాహసం తెలిసి ప్రభాస్ పట్టుదలగా తనని శ్రీరాముడుగా రిప్రజెంట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడని అతని మాటల బట్టి అర్ధమవుతుంది.