లైట్ తీసుకుంటున్న పవన్ ... రగిలిపోతున్న ఫ్యాన్స్       2018-06-30   23:03:11  IST  Bhanu C

రాజకీయంగా దూకుడు పెంచిన పవన్ కళ్యాణ్ ఎన్నికలే లక్ష్యంగా ప్రజా పోరాట యాత్ర చేస్తూ.. తన ఆవేశపూరిత ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకుంటూ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై అధికార పార్టీపై విమర్శల బాణాలు కూడా వదులుతున్నాడు. దీంతో పాటు జనసేనలోకి కూడా ఇప్పుడిప్పుడే ముఖ్యనేతల చేరికలు ప్రారంభమయ్యాయి. అయితే అదే సమయంలో జనసేనానికి కొత్త తలనొప్పులు కూడా మొదలయ్యాయి.

పవన్ యాత్రలో జనసేన కార్యకర్తలకు, వాలంటీర్లకు ఇస్తోన్న విలువ ఫ్యాన్స్‌కు ఇవ్వడం లేదని అభిమాన సంఘాలు గుర్రుగా ఉన్నారు. అభిమానులు పవన్‌‌ను కలవకుండా వాలంటీర్లు, కార్యకర్తలు అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు. ముఖ్యంగా పవన్‌ పోరాట యాత్రలో ఫ్యాన్స్‌ను కనీసం లెక్కలోకి తీసుకోవడం లేదని వాపోతున్నారు. దీంతో జనసేన కార్యకర్తలకు, పవన్‌ ఫ్యాన్స్‌కు మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. అభిమానులను పవన్‌ నిర్లక్ష్యం చేయడాన్ని ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు.

పవన్‌ సినిమా హిట్టయినా ప్లాపైనా అండగా ఉంటూ వచ్చిన అభిమాన సంఘాలను పట్టించుకోకపోవడం సరికాదంటున్నారు. పవన్‌ కోసం అనేక కార్యక్రమాలను చేపడుతూ ఏళ్ల తరబడి పవన్‌ మాటలను జనాల్లోకి తీసుకెళ్లిన ఫ్యాన్స్‌ ని ఇప్పుడు ఇలా దూరం చేయడం తగదని వాపోతున్నారు.

పోరాట యాత్రలో తమకు జరుగుతోన్న అవమానాన్ని జనసేనాని దృష్టికి తీసుకెళ్లినా లైట్‌ తీసుకున్నారంటూ రెండు రాష్ట్రాల్లోని పవన్‌ ఫ్యాన్స్‌ రగిలిపోతున్నారు. ఒకవైపు చూస్తే జనసేన పార్టీ నిర్మాణం ఇప్పుడిప్పుడే ప్రారంభం అయినట్టుగా ఉంది. మెల్లిగా ఒక్కొక్కరూ పార్టీలో చేరుతున్నారు. ఫర్లేదు పార్టీ కాస్త బలం పుంజుకుంటోంది అనుకుంటున్నసమయంలో పవన్ అభిమానుల నుంచే ఇలా అసంతృపి మొదలవ్వడం … దాన్ని పవన్ పరిష్కరించకుండా వదిలెయ్యడం ఆ పార్టీకే తీరని నష్టం చేకూర్చే అంశం. దీనిపై పవన్ దృష్టిపెట్టి నష్ట నివారణ చర్యలు తీసుకోకపోతే మరో ప్రజారాజ్యంలా తయారవుతుంది ఇది కన్ఫర్మ్.