ఢిల్లీ స్థాయి ఎన్నికలను తలపించిన గల్లీ ఎన్నికల ఫలితాలు కొందరు రాజకీయ నేతల భవిష్యత్‌ను మార్చనుంది.పేరుకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే అయినప్పటికీ ప్రధానంగా టిఆర్ఎస్, బిజెపిల మధ్య బిగ్ ఫైట్ గా కొనసాగింది.
రాష్ర్టంలో టిఆర్ ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజెపినే అనే తరహా గ్రేటర్ ఎన్నికల ప్రచారం జరిగింది.కానీ ఫలితాలు ఎలా ఉంటాయని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కొందరు నేతలు తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇప్పటి వరకు టిఆర్ఎస్ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేతలు, టిఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న వారు, కొంత కాలంగా ఆ పార్టీ కార్యాకలాపాలకు దూరంగా ఉన్న నేతలు కూడా గ్రేటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.బిజెపి ముందు నుంచి చెబుతున్నట్టుగా ఎక్కవ మొత్తంలో కార్పొరేట్ స్థానాలు దక్కితే తాము కూడా కమలం గూటికి చేరేందుకు కొందరు నేతలు సిద్ధంగా ఉన్నారు.
మేయర్ స్థానం తిరిగి టిఆర్ఎస్ వరించినప్పటికీ బిజెపికి ఎన్ని కార్పొరేట్ స్థానాలు దక్కుతాయనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.ఒక వేళ బిజెపికి ఎక్కువ మొత్తంలోనే కార్పొరేట్ స్థానాలు దక్కితే ఇక రాష్ర్టంలో ఆ పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుందని కొందరు నేతలు అంచనా వేస్తున్నారు.అదే జరిగితే ఆ ఫలితాల ఆధారంగా తమ రాజకీయ భవిష్యత్ ను నిర్ణయించుకోవాలని వారు చెబుతున్నారు.తమ పార్టీలో చేరాలని ఇది వరకే కొందరు బిజెపి నేతలు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలను ఆశ్రయించారు.
ఇందులో కొందరు బిజెపిలో చేరగా మరి కొందరు కాస్త సమయం కావాలని, ఇంకొందరు ఇప్పడే చేరబోమని కమలం నేతలకు చెప్పినట్టు తెలిసింది.అయితే కొంత కాలం తర్వాత బిజెపిలో చేరుతామని మాట ఇచ్చిన వారు మాత్రం గ్రేటర్ ఎన్నికల ఫలితాలను చూసి బిజెపిలో చేరాలా ? వద్దా? అనేది నిర్ణయించుకోనున్నారు.