హర్యానాలో రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది.ఈ మేరకు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్ధతును ఉపసంహరించుకున్నారు.
ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు.రాష్ట్రంలో రైతు సమస్యలతో పాటు ధరల పెరుగుదల మరియు నిరుద్యోగం పెరిగిపోయిన నేపథ్యంలో ఇకపై బీజేపీ(BJP) ప్రభుత్వానికి మద్ధతు ఇవ్వబోమని స్వతంత్ర ఎమ్మెల్యేలు లేఖలో పేర్కొన్నారు.
దీంతో హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది.
మొత్తం 90 మంది సభ్యులు ఉన్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి సొంతంగా 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
మరో ముగ్గురు స్వతంత్రుల మద్ధతుతో 43 మంది బీజేపీ(BJP) వైపు ఉన్నారు.అయితే హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు మొత్తం 46 మంది మద్ధతు అవసరం.గతంలో ప్రభుత్వ ఏర్పాటుకు జననాయక్ జనతా పార్టీ(Jananaik Janata Party) మద్ధతు కోరిన బీజేపీ లోక్ సభ ఎన్నికలకు ముందు ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంది.కాగా ప్రస్తుతం కాంగ్రెస్ కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
బీజేపీకి మద్ధతు ఉపసంహరించుకున్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ (Congress)కు మద్ధతు ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ప్రభుత్వాన్ని కొనసాగించాలంటే బీజేపీ మరోసారి జననాయక్ జనతా పార్టీ మద్ధతు కోరాల్సిందేనని తెలుస్తోంది.
కాగా ఈ ఏడాది చివరిలో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.