గత వారం కెనడాలో( Canada ) అదృశ్యమైన భారతీయ విద్యార్ధి కథ విషాదాంతమైంది.అనుమానాస్పద స్థితిలో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళితే.గతవారం పశ్చిమ మానిటోబోలోని ఓ నగరం నుంచి విషయ్ పటేల్( Vishay Patel ) అదృశ్యమయ్యారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో ఆదివారం బ్రాండన్ నగరానికి తూర్పున వున్న అస్సినిబోయిన్ నది, హైవే 110 వంతెనకు సమీపంలో పటేల్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
బాధితుడు జూన్ 16న ఉదయం తప్పిపోయినట్లు బంధువులు తెలిపారు.గ్రే కలర్ 2012 మోడల్ హోండా సివిక్‌లో తన ఇంటి నుంచి బయలుదేరినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించినట్లు ది బ్రాండన్ సన్( The Brandon Sun ) నివేదించింది.
పటేల్ అదృశ్యమైన అదే రోజు సాయంత్రం స్థానిక హోమ్ డిపో పార్కింగ్ స్థలంలో సివిక్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.రివర్ బ్యాంక్ డిస్కవరీ సెంటర్ గ్రౌండ్స్ వైపు పటేల్ నడుచుకుంటూ వెళ్లడాన్ని చూశామని ఓ ప్రత్యక్ష సాక్షి పోలీసులకు తెలిపారు.

దీంతో జూన్ 17న మధ్యాహ్నం నాటికి బ్రాండన్ పోలీస్ సర్వీస్( Brandon Police Service ) (బీపీఎస్) రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.ఈ క్రమంలో జూన్ 18 (ఆదివారం) సాయంత్రం ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది ఆ ప్రాంతంలో జరిపిన శోధన ఫలితంగా తప్పిపోయిన పటేల్ మృతదేహం లభించిందని అధికారులు తెలిపారు.గుజరాత్‌కు చెందిన పటేల్ గత రెండేళ్లుగా అస్సినిబోయిన్ కమ్యూనిటీ కాలేజ్( Assiniboine Community College )లో చదువుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

అంతకుముందు కెనడాలో గుజరాత్‌కే చెందిన ఒక విద్యార్ధి ఏప్రిల్ నెలలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు.అతనిని అహ్మదాబాద్‌కు చెందిన హర్ష్ పటేల్‌గా గుర్తించారు.అప్పటికి కొన్ని రోజులు ముందు కూడా ఆయుష్ అనే విద్యార్ధి కూడా అదే రీతిలో ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.
ఈ ఇద్దరూ గుజరాత్‌కు చెందినవారే , ఇద్దరూ యార్క్ యూనివర్సిటీలోనే చదువుతున్నారు, అలాగే ఇద్దరి మృతదేహాలు నీటి గుంతల సమీపంలోనే దొరికాయి.ఆశ్చర్యకరంగా వీరిద్దరి ఫోన్‌లు కనిపించలేదు.
దీంతో వీరి మరణం వెనుక ఏదైనా మిస్టరీ వుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.