భూకంపం అనుకున్నారు ... కానీ ....?   Polavaram Project Road Damaged Due Environmental Changes     2018-11-04   07:33:27  IST  Sai M

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో కలకలం రేగింది. ప్రాజెక్టు వెళ్లే రోడ్డుకు పగుళ్లు ఏర్పడడంతో ఆ ప్రాంతంలో భూకంపం వచ్చిందని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శనివారం రహదారికి భారీగా బీటలు ఏర్పడటంతో … పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం రాకపోకలు సాగిస్తున్న సుమారు పది లారీలను డ్రైవర్లు అక్కడే వదిలేసి దూరంగా పరుగులు తీశారు. ఆ రోడ్డు సమీపంలో మట్టి తవ్వుతున్న జెసిబి కొంతభాగం భూమిలోకి కూరుకుపోయింది. రోడ్డు సుమారు పది అడుగులకుపైగా పైకి పొంగడంతో ఆ ప్రాంతంలో భూకంపం సంభవించిందని వదంతులు వ్యాపించాయి. పోలవరం ప్రాజెక్టు ఇంజినీర్లు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

ఈ పరిణామాలకు భూకంపం కారణం కాదని, ప్రకంపనలు ఏవి ఈ ప్రాంతంలో చోటుచేసుకోలేదని ప్రాజెక్టు ఇంజి నీర్లు స్పష్టం చేశారు. భూమిలో హీట్‌ ఆఫ్‌ హైడ్రేషన్‌ వల్ల పగుళ్లు ఏర్పడ్డాయని తెలిపారు. స్పిల్‌ ఛానల్‌ కోసం మట్టి తరలించడానికి వేసిన రోడ్డు మార్గంలో కొండరాళ్లు, మట్టి బరువెక్కడం, భారీ వాహనాలు వెళ్లడం వల్ల పక్కనే ఉన్న ఈ రోడ్డుకు పగుళ్లు ఏర్పడ్డా యని వివరణ ఇచ్చారు. పోలవరం చెక్‌పోస్టు ప్రాంతంలో ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో ఎగువనున్న గిరిజన గ్రామాలకు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. దీంతో డైవర్షన్‌ రోడ్డు పనులను అధికారులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు.