2019లో పవన్‌ పొలిటికల్‌ మూవీ       2018-05-02   00:46:17  IST  Bhanu C

పవన్‌ కళ్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్‌ అవ్వడంతో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి షిఫ్ట్‌ అయిన విషయం తెల్సిందే. వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్న కారణంగా సినిమాపై ఇప్పట్లో దృష్టి పెట్టను అంటూ ఆ మద్య ప్రకటన చేశాడు. 2019 ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం మాత్రమే కాకుండా కింగ్‌ అవ్వాలనేది ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ దృష్టి అన్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో టీడీపీ, బీజేపీ, వైసీపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు జనసేనాని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. మొన్నటి వరకు పార్టీని బలోపేతం చేసే విషయంలో పెద్దగా పట్టించుకోని పవన్‌ తాజాగా హడావుడిగా ఆ పనులు చేస్తున్నాడు.

ఈ సమయంలోనే పవన్‌ కళ్యాణ్‌ ఒక సినిమా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. పార్టీ ప్రధాన సలహాదారు మరియు ముఖ్య నాయకులు అంతా కూడా ఒక పొలిటికల్‌ డ్రామా మూవీ చేసి, అందులో తాను సీఎం అయితే ఎలాంటి పనులు చేస్తాను అనే విషయాలను పవన్‌ ప్రజలకు తెలియజేయాలని, ఆ సినిమాను స్వయంగా పవన్‌ డైరెక్ట్‌ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పవన్‌ 2019 ఎన్నికల ముందు వరకు ఒక సినిమాతో వస్తే క్రేజ్‌ భారీగా ఉంటుందని, తప్పకుండా రాజకీయంగా కూడా ఆ సినిమా ఉపయోగపడుతుందని పార్టీ నాయకులు ఆశ పడుతున్నారు.

పవన్‌కు మాత్రం మళ్లీ సినిమాల్లోకి వెళ్లే ఆలోచన లేదు. ముఖ్యంగా 2019 ఎన్నికల ముందు కెమెరా ముందుకు వెళ్లాలని తనకు లేదు అంటూ క్లారిటీగా చెప్పేశాడు. అయితే పార్టీ సీనియర్‌లు మరియు వ్యూహకర్త చెబుతున్న దాంట్లో కూడా పాయింట్‌ ఉంది కదా అని పవన్‌ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే మంచి పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో కథ వస్తే నటించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. నటించాలి అనుకున్నాం కదా అని ఏదో ఒకటి నటించొద్దని కూడా ఆయన భావిస్తున్నాడు. ప్రస్తుతం పలువురు రచయితలు ఒక మంచి పొలిటికల్‌ నేపథ్యంలో కథను రాసేందుకు కసరత్తు చేస్తున్నారు.

మెగా ఫ్యామిలీ హీరోలు పలువురు ఉన్నా కూడా జనసేన పార్టీ ప్రచారంలో పాల్గొంటారనే నమ్మకం లేదు. అందుకే సినీ గ్లామర్‌ పార్టీకి అవసరం. ఆ కారణంగానే పవన్‌ కళ్యాణ్‌ మళ్లీ సినిమాలో నటిస్తే రెండు విధాలుగా ఉపయోగం ఉంటుందని పార్టీ వ్యూహకర్త భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే సినిమా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 2019 జనవరిలో సినిమా విడుదల చేసే అవకాశాలున్నాయి. పవన్‌ మూవీతో వస్తే జనాలు నీరాజనాలు పలకడం ఖాయం.