పవన్ ని నమ్మని నాయకులు .. అదే జనసేన దుస్థితికి కారణమా ..?       2018-05-28   00:45:41  IST  Bhanu C

ఒక రాజకీయ పార్టీని నడపడమంటే ఆషామాషీ కాదు. ఎన్నో వ్యూహాలు .. ఎన్నెన్నో ఆలోచనలు ఉండాలి. అంతెందుకు ప్రతిక్షణం అప్డేట్ అవుతూనే ఉండాలి. ఎత్తుకు పై ఎట్టు వేస్తూ ప్రత్యర్థి పార్టీలను కంగారు పెట్టాలి. మన బలం ఏంటో … ప్రత్యర్థుల బలహీనతలు ఏంటో ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి అప్పుడే పార్టీ మనుగడ సాధ్యం అవుతుంది. ఇవేవి లేకపోతే కొంతకాలం పార్టీ పెట్టిన వ్యక్తి ఛరిష్మా మీద నడిచినా ఆ తరువాత మాత్రం కనుమరుగు అయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన మీద కూడా ఇటువంటి చర్చలే నడుస్తున్నాయి. ఆ పార్టీ కి ఇప్పటివరకు ఒక రాజకీయ విధానం అంటూ కనిపించడమే లేదు.

175 స్థానాల్లో పోటీ చేసేస్తామని ఘనంగా పవన్ ప్రకటిస్తున్నా ఇప్పటివరకు అందుకు తగ్గా కసరత్తు అయితే జరగడంలేదు. ఇప్పటివరకు ఆయా నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఎవరూ కనిపించడం లేదు. పైపెచ్చు జనసేనకు 05 , ఆరు సీట్లు మించి రావు అనే ప్రచారం కూడా బాగా జోరందుకుంది. జనసేనలో అంతా పవన్‌ అభిమాను లే కనిపిస్తున్నారు. పవన్‌కు కొత్తగా ఎలాంటి వ్యూహం లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి తన వ్యూహం ఫలిస్తుందని మొదటి నుంచి చెప్పుకొచ్చిన పవన్‌.. అసలు తనకు ఎలాంటి వ్యూహం లేదని, ప్రజలే వ్యూహం సిద్ధం చేయాలని అనడం ఆయన రాజకీయ అజ్ఞానాన్ని తెలియజేస్తోంది.

పవన్ చేస్తున్న పోరాట యాత్ర లో కూడా అంతా పవన్ అభిమానులే కనిపిస్తున్నారు తప్ప ఎక్కడ జనసేన కార్యకర్తలు కనిపించడమే లేదు. పవన్ అభిమానుల్లో కూడా చాలామందికి ఇప్పటివరకు సభ్యత్వమే లేదు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన ప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. కాపు నాయకులు, మాజీ మంత్రులు, వివిధ స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు కూడా క్యూకట్టుకుని మరీ చిరంజీవి ఇంటి ముందు క్యూ కట్టేవారు. కానీ, ఇప్పుడా పరి స్థితి కనిపించడం లేదు.

నిజానికి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కీలక నాయకులు పవన్ గూటికి వెళ్తారని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. అయితే గోదావరి జిల్లాలో అందుకు భిన్నంగా జరుగుతోంది. దీనికి కారంణం నాయకుల్లో పవన్ మీద నమ్మకం లేకపోవడమే అని తెలుస్తోంది. పవన్ మూడ్ ని బట్టి ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతుంటాడని.. ఇతడిని నమ్ముకుని పార్టీలోకి వెళ్తే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టే అని చాలామంది నాయకులు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది.