జనసేనాని ధైర్యం ఏంటి ..? ఎందుకా ప్రకటనలు ..?     2018-07-02   02:42:17  IST  Bhanu C

ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ..జనసేన రాజకీయం ఏంటో ఎవరికీ అర్ధం కావడంలేదు. వచ్చే ఎన్నికల్లో మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ చెప్తున్నా అందుకు ఆ పార్టీ సిద్ధంగా ఉందా అనే ప్రశ్న ఇప్పుడు మొదలయ్యింది. ఒక పక్క చూస్తే వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో నిర్విరామంగా పాదయాత్ర చేస్తూ ఆ పార్టీలో జోష్ నింపుతున్నాడు. ఇక టీడీపీ విషయానికి వస్తే ఆ పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టాడు. సర్వేలు చేయిస్తూ దానికి అనుగుణంగా పార్టీలో మార్పు చేర్పులు చేయిస్తున్నాడు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొదలు పెట్టిన యాత్ర విడతలవారీగా సాగుతోంది. ఈ యాత్ర ద్వారా జనాల్లోకి వెళ్లడమే కాకుండా పార్టీలో చేరికలు ఉండేలా పవన్ ప్లాన్ చేసుకుంటున్నాడు.ఇక వచ్చే ఎన్నికల్లో పవన్ తో కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే వామపక్షాలు ప్రకటించినా… జనసేన అధినేత నుంచి అందుకు విరుద్ధమైన ప్రకటన వచ్చేసింది. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఏ పార్టీతో పొత్తులేకుండానే 175 అసెంబ్లీ – 25 లోక్ సభ స్థానాల నుంచి పోటీకి దిగుతామని పవన్ ప్రకటించేశాడు.