నేను యాత్రలు చేస్తుంటే .. మీరు విహారయాత్రలు చేస్తున్నారా ..? కోర్ కమిటీపై పవన్ గుర్రు       2018-06-15   01:00:39  IST  Bhanu C

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి కోపం వచ్చింది. పార్టీ పరిస్థితి చూస్తే ఇంకా సరిగ్గా పట్టాలే ఎక్కలేదు ! ఒక వైపు జనాల్లో పార్టీకి మంచి ఊపు తీసుకొచ్చేందుకు నేను ఎండనక వాననకా జనాల్లో తిరుగుతుంటే అవేవి మీకు పట్టనట్టు తిరుగుతారా ..? ఇదేనా మీకు ఉన్న కమిట్మెంట్ అంటూ జనసేన అధ్యక్షు పవన్ కళ్యాణ్ ఆ పార్టీ కోర్ కమిటీ మీద గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని ఆయన పార్టీలో ఒకరిద్దరి దగ్గర ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

పార్టీ మీటింగ్స్ లో నాయకులూ అంతా … తాము చావుకు కూడా సిద్ధంగా ఉన్నామంటూ ప్రతిజ్ఞలు చేసి, తీరా జనాల్లోకి వెళ్లేసరికి ఒక్కడూ కనిపించకపోవడంతో, పవన్ కు దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. పార్టీ జనరల్ సెక్రటరీ పదవిని దక్కించుకున్న తోట చంద్రశేఖర్ ఆ పదవి వచ్చిన రోజు తప్ప మళ్లీ కనిపించలేదట. ఉత్తరాంధ్రలో ఎండ, వాన అని చూడకుండా పవన్ తిరుగుతుంటే, జనరల్ సెక్రటరీ తోట చంద్రశేఖర్ హైదరాబాద్ లో కూర్చుని సీట్లకు బేరసారాలు చేసినట్లు
సమాచారం.

ఇంకో కీలక నేతగా ఉన్న అశోక్ ఏకంగా అమెరికా వెళ్లి, హాలిడేస్ ను ఎంజాయ్ చేసి వచ్చాడు. పవన్ మిత్రుడు బన్ను యూరప్ పర్యటనకు వెళ్లిపోయాడట. విశాఖ జిల్లా ఇంఛార్జి అయితే మరీ విడ్డూరం. పార్టీ అధినేత ఉత్తరాంధ్ర పర్యటన ప్రారంభమైన తర్వాత విదేశాలకు వెళ్ళిపోయాడట. ఇంకో కీలక నాయకులైన రాఘవయ్య, ముత్తంశెట్టి కృష్ణారావు లాంటి వాళ్లు అప్పుడప్పుడు కనిపించి మాయమైపోయారట. యాత్ర మొత్తమ్మీద కొద్దో గొప్పో పనిచేసింది జనసేన వ్యూహకర్త దేవ్ ఒక్కడేనట.

ఇదే పవన్ కి ఆగ్రహం తెప్పించిందట. నా ముందు ఒకలా నేను లేనప్పుడు ఒకలా నటించడం పవన్ కి బాధేస్తోందట.వాళ్ళ గురించి నేను ఎంతో ఉన్నతంగా అనుకుంటుంటే, వాళ్లలో కనీస చిత్తశుద్ధి లేకపోవడమేంటి అని బాధపడిపోయాడట జనసేనాని. అవునులే అసలు అధ్యక్షుడే ఎప్పుడు ఏమి చేస్తాడో పార్టీలో ఉన్న నాయకులకే తెలియదు కదా అందుకే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరికీ వారే అన్నట్టు ఎవరికీ తోచిన విధంగా వారు వ్యవహరిస్తున్నారు.