రాజకీయంగా ఏపీలో బలపడేందుకు, 2024లో బలమైన శక్తిగా జనసేన ను తీర్చిదిద్దేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు.దీనిలో భాగంగానే ఏపీ వ్యాప్తంగా ఉన్న వివిధ సమస్యలపై పార్టీ తరఫున పోరాటం చేస్తూ, ప్రజల లో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా పవన్ ఉద్యమాన్ని మొదలు పెట్టారు.అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడినా, ఉద్యమాలు మొదలైన సమయంలో జనసేన సైలెంట్ గానే ఉంది.
అయితే ఇప్పుడు పవన్ ఆలస్యంగా ఈ ఉద్యమాన్ని చేపట్టారు.నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న నిరసన దీక్షకు పవన్ మద్దతు తెలుపుతూ భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేశారు. ప్రైవేటీకరణ వ్యవహారం పూర్తిగా కేంద్రం చేతిలో ఉంది అనే విషయాన్ని పవన్ పక్కన పెట్టి, వైసీపీ నే ప్రశ్నించారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం ఏం చేస్తోందో పవన్ చెప్పాలి అంటూ నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని, ఏపీలో బంద్ చేపడుతూ, ఢిల్లీలో మద్దతు ఇస్తున్నారని , అసలు ఉక్కు ప్రైవేటీకరణ అనేది పూర్తిగా వైసీపీ ప్రభుత్వానికి తెలిసే జరుగుతోందని, పార్లమెంట్ సాక్షిగా ఈ విషయం ఎప్పుడో బయటపడింది అంటూ పవన్ ప్రసంగంలో పేర్కొన్నారు.
అసలు ఈ విషయంలో కేంద్రాన్ని తాము బాధ్యులను చేయదల్చుకోలేదు అని, ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే అని తేల్చేశారు.

కేంద్రం తమ మాట వినదని వైసీపీ నేతలు చెబుతున్నారని, అటువంటప్పుడు సీఐఏ వ్యవసాయ చట్టాలకు ఎందుకు మద్దతు ఇచ్చారు అని ప్రశ్నించారు.అసలు కార్మికుల కష్టాలు కేంద్రానికి ఏం తెలుస్తాయని, ఇక్కడ సమస్యలు తెలియని , మన ఎంపీలు కేంద్రానికి చెప్పాలని పవన్ చెప్పుకొచ్చారు.పవన్ వైఖరి చూస్తుంటే ఈ విషయంలో బిజెపి ని విమర్శిస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో వైసీపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు, ఈ మొత్తం వ్యవహారంలో బిజెపి కి ఇబ్బందులు తలెత్తకుండా వైసీపీ వైపు డైవర్ట్ చేసే విధంగా ఉన్నట్టు కనిపిస్తోంది.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం పూర్తిగా తమ పరిధిలోనిదని కేంద్రం ఎప్పుడు ప్రకటించింది .ఇప్పటికే ఈ ప్రైవేటీకరణ అంశం దాదాపు పూర్తయ్యే స్థాయికి వచ్చేసింది.ఇప్పుడు జనసేన ఆధ్వర్యంలో నిరసన చేసినా, ఉపయోగం ఉండదనే విషయం పవన్ కీ తెలిసినా వైసీపీని టార్గెట్ చేసుకునేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.