ఉత్త‌రాంధ్ర‌పై ప‌వ‌న్‌కు ఎందుకింత ఓవ‌ర్ ఫీల్‌!       2018-06-23   00:41:21  IST  Bhanu C

ప్ర‌శ్నిస్తానంటూ ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చి, పార్టీ పెట్టిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇటీవ‌ల 45 రోజుల టార్గెట్‌తో పోరు యాత్ర ప్రారంభించారు. అది కూడా ఉత్త‌రాంధ్ర‌లో ఆయ‌న ఈ యాత్ర సాగించ‌డం గ‌మ‌నార్హం. అయితే, ఈ యాత్ర‌కు అనుకోని అవాంత‌రాలు ఏర్ప‌డుతుండ‌డంతో కుంటుతోంది. ఇదిలావుంటే, అక‌స్మాత్తుగా ఉత్త‌రాంధ్ర‌పై ప‌వ‌న్‌కు ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చింది? ఆయ‌న ఎందుకింత‌గా ఫీలైపోతున్నారు? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. నిజానికి రాష్ట్రంలో అనేక ప్రాంతాలు వెనుక‌బ‌డే ఉన్నాయి. వాటికి కేవలం ఆర్థిక కార‌ణాలే కార‌ణం కాదు.

ప‌లు భౌగోళిక కార‌ణాలు, రాజ‌కీయ కార‌ణాలు కూడా ఉన్నాయి. వీటి వ‌ల్లే.. ఆయా ప్రాంతాలు వెనుక‌బ‌డి ఉన్నాయి. అయితే, వీట‌న్నింటినీ వ‌దిలేసి.. ప‌వ‌న్ నేరుగా ఉత్త‌రాంధ్ర వైపే అడుగులు వేశారు. నిజానికి ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం అనేది ఇవాళ పవన్ కల్యాణ్ కొత్తగా కనిపెట్టిన సంగతి ఎంతమాత్రమూ కాదు. ఆ ప్రాంతానికి ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని ఆయన నినదిస్తున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు అంటే నే ఏ రోటికాడ ఆ పాట పాడే రకాలు గనుక.. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్.. ఇలా ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం గురించి, వారికి జరుగుతున్న అన్యాయం గురించి ఎలుగెత్తి చాటడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

కాకపోతే.. ఇప్పుడు ఇలా ఎందుకు ఆయ‌న తీవ్రంగా ఈ ఒక్క ప్రాంతంపైనే దృష్టి పెట్టారా? అనేది అంతుప‌ట్ట‌డం లేదు. వాస్త‌వానికి ఉత్త‌రాంధ్ర‌లోని విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో.. టీడీపీ బ‌లంగా ఉంది. దీంతో టీడీపీపై క‌త్తిక‌ట్టిన ప‌వ‌న్‌.. ఆ పార్టీని బ‌ద్నాం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌న్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు ఆ క్ర‌తువులో భాగంగానే ఆయ‌న ఆందోళ‌న‌కు సిద్ధ‌మ‌య్యారా? లేక ప్ర‌త్యేక కార‌ణం ఏదైనా ఉందా? అనే అంద‌రినీ వేధిస్తున్న ప్ర‌శ్న‌. ఒక వేళ ప‌వ‌న్ ఈ ప్రాంతాన్ని ప్ర‌త్యేక రాష్ట్రంగా ప్ర‌క‌టించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారనేది కొంద‌రి వాద‌న‌. అయితే, ఈ వాద‌న‌ను జ‌న‌సేన సీనియ‌ర్లు.. తిప్పికొడుతున్నారు.

ప‌వ‌న్ విభ‌జ‌న‌కు వ్య‌తిరేక‌మ‌ని వారు చెబుతున్నారు. అయితే, ఉత్త‌రాంధ్ర‌లో ఆయ‌న నిర్వ‌హించిన యాత్ర ద్వారా అయినా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుద‌ని ఆశించామ‌ని, అయితే, అలా జ‌ర‌గ‌క‌పోవ‌డం, ప్ర‌భుత్వం నుంచి క‌నీస స్పంద‌న కూడా లేక‌పోవ‌డంతో పవ‌న్ పున‌రాలోచ‌న‌లోప‌డ్డార‌ని అంటున్నారు. మొత్తంగా ఉత్త‌రాంధ్ర‌పై అధిక భాగం దృష్టి సారించ‌డం అనేది పార్టీ రాజ‌కీయ వ్యూహంలో భాగ‌మే త‌ప్ప విభ‌జ‌న కోసం కాద‌ని వారు క్లారిటీ ఇస్తున్నారు. మ‌రిదీనిపై ప‌వ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.