ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌.... ఎన్ని సీట్లు బాబు...       2018-05-31   01:21:08  IST  Bhanu C

ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు తాను ఎన్నిక‌ల్లో పోటీ చేసే అసెంబ్లీ సీటు విష‌యంలో తీవ్ర‌మైన గంద‌ర‌గోళంలో ప‌డిపోయిన‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్‌కు ముందు నుంచి ఏ విష‌యంలోనూ స‌రైన క్లారిటీ అయితే లేదు. హ‌డావిడిగా రావ‌డం ఏదేదో ప్ర‌క‌ట‌న చేసేసి వెళ్లిపోవ‌డం, మ‌ళ్లీ రావ‌డం మ‌రోసారి మ‌రోమాట మాట్లాడ‌డం అల‌వాటు అయ్యింది. గ‌తంలో తాను అనంత‌పురం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తుంద‌ని చెప్ప‌డంతో పాటు తాను అనంత‌పురం జిల్లా నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తాన‌ని చెప్పారు.

దీంతో చాలా మంది ప‌వ‌న్ అనంత‌పురం జిల్లా నుంచే పోటీ చేస్తార‌ని ఫిక్స్ అయ్యారు. అదే జిల్లాలోని అనంత‌పురం అర్బ‌న్‌, గుంత‌క‌ల్‌, క‌దిరి సీట్ల‌లోనే ప‌వ‌న్ పోటీ చేయ‌వ‌చ్చ‌ని ఊహాగానాలు కూడా వ‌చ్చాయి. ఆ త‌ర్వాత ప‌వ‌న్ సొంత జిల్లాలో ప‌శ్చిమ‌గోదావ‌రిలోని పాల‌కొల్లు నుంచి కూడా ఆయ‌న పేరు వ‌చ్చింది. ప‌వ‌న్ అదే జిల్లాలోని ఏలూరులో ఓటు హ‌క్కు న‌మోదు చేయించుకోవ‌డంతో ప‌వ‌న్ ఏలూరులో పోటీ చేయ‌వ‌చ్చ‌న్న ప్ర‌చారం జ‌రిగింది.

ఇక కొద్ది రోజుల క్రితం త‌న అన్న గెలిచిన తిరుప‌తిలో ప‌వ‌న్ పోటీ చేస్తార‌ని… అక్క‌డ ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గ‌మైన బ‌లిజ వ‌ర్గం ఓట‌ర్లు ఎక్కువుగా ఉండ‌డంతో అక్క‌డ ప‌వ‌న్ పోటీ చేస్తే గెలుపు సులువు అవుతుంద‌ని భావిస్తున్న‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాలే ప్ర‌చారం చేశాయి. ఇక ఇప్పుడు ప‌వ‌న్ శ్రీకాకుళం జిల్లాలో పోరాట‌యాత్ర చేస్తుండ‌డంతో ఇప్పుడు ప‌వ‌న్ అక్క‌డ కూడా పోటీ చేస్తార‌ని జ‌న‌సేన కాంపౌండ్ నుంచి టాక్ లీక్ అయ్యింది.

అస‌లు ప‌వ‌న్ ఎమ్మెల్యేగా ఎక్క‌డ పోటీ చేస్తారో ? కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ప‌వ‌న్‌కు తాను ఎక్క‌డ పోటీ చేయాల‌న్న దానిపై క్లారిటీ లేక‌పోవ‌డం, త‌న‌లో త‌న‌కే స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంతో పార్టీలోనే ప‌వ‌న్ ఎక్క‌డ పోటీ చేస్తాడ‌న్న‌దానిపై పెద్ద గంద‌ర‌గోళం న‌డుస్తోంది. ఏ సీటు చూసినా ప‌వ‌న్ గెలుపు అంత వీజీ అయ్యేలా లేదు. దీంతో ప‌వ‌న్ త‌న సీటు విష‌యంలోనే పెద్ద డైల‌మాలో ఉన్న‌ట్టు తెలుస్తోంది.