వైలెన్స్ ఎక్కువయ్యింది పవన్ .. కాస్త సైలెంట్ అయితే బెటరేమో       2018-07-06   00:35:11  IST  Bhanu C

రాజకీయాల్లో రాణించాలంటే ఆలోచన ఉండాలి కానీ ఆవేశం ఉండకూడదు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తనలోని ఆవేశాన్ని అణుచుకోలేకపోతున్నాడు. తప్పో రైటో ముందు తాను అనాల్సింది అనేస్తున్నాడు. దీనివల్ల అప్పుడు చప్పట్లు మోగుతాయేమో కానీ ఆ తరువాత తిప్పలు మాత్రం తప్పవు. ఈ విషయాన్ని పవన్ గుర్తించలేకపోతున్నాడు. అందుకే ఇంకా పప్పులో కాలేస్తున్నాడు. అయినా గత కొద్ది రోజులుగా పవన్ మాట్లాడుతున్న మాటలు చాలా వైలెన్స్ గా ఉంటున్నాయి. మొదట్లో పవన్ మాటలు అందరూ సీరియస్ గా తీసుకునే వారు .. కానీ ఇప్పుడు ఆయన ఎంతగా రెచ్చగొట్టినా అందరూ లైట్ తీసుకుంటున్నారు. ఆ పవన్ కళ్యాణ్ అంతేలే పెద్దగా పట్టించుకోనవసరం లేదు అనే ధోరణి అందరిలోనూ కనిపిస్తోంది.

డైలాగులు వదలడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ని పవన్ ఆదర్శంగా తీసుకున్నాడో ఏమో కానీ పెందుర్తిలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడినట్లు.. ” ఎమ్మెల్యే కొడుకులు జాగ్రత్త” అని హెచ్చరికలు జారీ చేసేశారు. ఆ తర్వాత ముదపాక అనే గ్రామంలో భూముల పరిశీలనకు వెళ్లి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిపై అంతకు మించి వ్యాఖ్యలు చేశారు. ” చొక్కా పట్టుకుని రోడ్లపైకి తీసుకువస్తామంటూ..” తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు.
అయితే పవన్ ఆవేశాన్ని బండారు చాలా పకడ్బందీగా వాడుకున్నారు. ప్రజాసేవ చేస్తానని చెప్పి వచ్చి చంపేస్తానని బెదిరిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

సాధారణంగా బండారు సత్యనారాయణమూర్తి ఎవరిపైనైనా విమర్శలు చేయాల్సి వస్తే చాలా తీవ్రంగా స్పందిస్తారు. పవన్ కల్యాణ్ విషంలోనూ అంతే స్పందించారు. కానీ పాపం పవన్ కల్యాణ్ అన్నట్లు ఆయన వ్యవహారశైలి ఉంది. పెట్రోయూనివర్శిటీ భూముల విషయంలో పవన్ చేసిన ఆరోపణలను.. ఆయన చాలా తేలిగ్గా తీసుకున్నారు. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయితే తనకు తన కుమారుడికి లింక్ పెట్టడం అమాయకత్వమేనని తేల్చారు.

గతంలోనూ పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో ఇలాంటి మాటలే మాట్లాడారు. గుడ్డలూడదీసి కొడతాం. చొక్కాలు పట్టుకుంటాం..లాంటి డైలాగులు సినిమాల్లో చెప్పడానికి బాగుంటాయి కానీ.. రాజకీయాల్లో పనికిరావు. సినిమా డైలాగులకు..రాజకీయ ప్రసంగాలకు తేడా తెలుసుకోలేకపోతే … రాజకీయాల్లో నటిస్తున్న ఓ నటుడిగానే ప్రజలకు గుర్తుండిపోతారు.