జనసేన పార్టీని సరికొత్త రీతిలో ముందుకు తీసుకెళ్లేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు.పార్టీ పెట్టి ఏళ్ళు గడుస్తున్నా, ఇప్పటికీ పెద్దగా బలం లేకపోవడం, క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం చేయలేకపోవడం, పార్టీలో ఉన్న నాయకులకు పెద్దగా నమ్మకం కలిగించ లేకపోవడం, రాబోయే ఎన్నికల నాటికి బలం పుంజుకుని అధికారం లోకి వచ్చే ఛాన్స్ అంతంత మాత్రంగా ఉండడం, ఇలా ఎన్నో అంశాలు పవన్ కు ఇబ్బందికరంగా మారాయి.
ఇక ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున జనసేన లో చేరుతారని మొదటి నుంచి పవన్ అభిప్రాయపడుతూ వస్తున్నారు.ఆ పరిస్థితి కనిపించకపోవడం ఎవరు జనసేన వైపు వచ్చేందుకు ఇష్టపడకపోవడం, తదితర కారణాలతో జనసేన గ్రాఫ్ పెద్దగా పెరగలేదు.
అయితే పవన్ సామాజిక వర్గానికి చెందిన యూత్ పూర్తిగా అండదండలు అందిస్తున్నా, మిగతా వర్గాల మద్దతు అంతంతమాత్రంగా ఉండటంతో ఏదోరకంగా కొత్త ఉత్సాహం తీసుకొచ్చి దిశగా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు.
ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలలో నిమగ్నం కావడం వల్ల పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేక పోవడంపై నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవుతున్న తరుణంలో , ఏపీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని, అలాగే తెలంగాణలోని పార్టీని యాక్టివ్ చేసి అక్కడా సమర్థవంతమైన యువనేతకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలని పవన్ డిసైడ్ అయ్యారట.
అయితే తాను చంద్రబాబు తరహాలోనే జాతీయ అధ్యక్షుడిగా ఉండాలనేది పవన్ అభిప్రాయమట.తెలంగాణలో పార్టీ ప్రభావం ఏమాత్రం లేకపోవడం , ఏపీలో ను అంతంతమాత్రంగానే ఉన్న తరుణంలో పవన్ జాతీయ అధ్యక్షుడుగా ఉండేందుకు ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది అనేది అనుమానమే.

ముఖ్యంగా ఏపీలో కొత్త అధ్యక్షుడిని నియమించడం ద్వారా యాక్టివ్ గా పార్టీ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, ప్రభుత్వం పైన పోరాడేందుకు, ప్రజాసమస్యలను హైలెట్స్ చేసేందుకు అవకాశం ఉంటుందని, అలాగే తాను ఏపీ లో ఉన్నా, లేకపోయినా పార్టీ కార్యక్రమాలు దూరంగా కొనసాగేందుకు అవకాశం ఏర్పడుతుంది అనే అభిప్రాయం, ఆలోచనతోనే పార్టీలో కొత్త అధ్యక్షుల నియామకం పై దృష్టి పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.