జనసేన లో ఈ క్లారిటీ ఉందా ..? అభ్యర్ధులు ఉన్నారా ..?       2018-06-03   00:27:33  IST  Bhanu C

ప్రశ్నించడమే తన పని నాకు ఎటువంటి పదవులు అవసరమే లేదంటూ పదే పదే చెప్పిన పవన్ ఇప్పుడు ప్రజాపోరాట యాత్రతో తన ఆలోచనను మార్చినట్లే కనిపిస్తుంది. తాను కూడా వైఎస్ జగన్ మాదిరి అధికారం ఉంటేనే ప్రజలకు మరింత సేవ చేయొచ్చని నమ్ముతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆ పార్టీకి పెద్దగా బలం లేకపోయినా ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించేశాడు. ఈ ప్రకటనే అందరిలోనూ సందేహాలు రేకెత్తిస్తోంది.

ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఏపీలో బలమైన టీడీపీ , వైసీపీ పార్టీలు ఎప్పటి నుంచో వ్యూహాలు రూపొందించుకుని అభ్యర్థులను కూడా దాదాపు సిద్ధం చేసుకున్నాయి. ఆఆ నియోజకవర్గాల్లో తమ బలం నిరుపించుకోవడానికి . జన,ధన బలం ఉన్న నాయకులు టీడీపీ మరియు వైసీపీలో ఉన్నారు. కానీ జనసేన పరిస్థితి అలా కాదు.

గత ఎన్నికల్లో పోటీ చేయలేదుగాని, టీడీపీ అధికారంలోకి రావడానికి విపరీతంగా ప్రచారం చేశాడు. ఇప్పుడు టీడీపీతో బంధం తెగిపోయాక వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించాడు. అయితే ఏపీలో జనసేనా పార్టీకి 175 స్థానాల్లో పోటీ చేయడానికి కనీసం అభ్యర్థులు దొరుకుతారా అనేది సందేహంగా మారింది.

ఇప్పటి వరకు పార్టీ నిర్మాణం మీదే పవన్ ద్రుష్టి పెట్టలేదు సరికదా ఆ పార్టీకి సరైన వ్యూహం అంటూ లేకుండా పోయింది. ఎప్పుడు ఏది గుర్తుకు వస్తే అది పట్టుకుని వేలాడే మనస్తత్వం పవన్ లో ఉంది. అదీ కాకుండా… ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయం పక్కన పెడితే జనసేన అధినేత ఎక్కడ నుంచి పోటీ చేస్తాడు అనే క్లారిటీ ఎవరికీ తెలియడం లేదు. కాసేపు అనంతపురం అని కాసేపు ఇచ్ఛాపురం అని స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. అలాగే జనసేన తరపున పోటీ చేయడానికి 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం అనేది సాధారణ విషయం కాదు. ధన, మత, కుల సమీకరణాలు అన్ని పక్కాగా చూసుకోవాలి. అసలు జనసేన కి అభ్యర్థులు దొరుకుతారు అనే సందేహం కూడా జనాల్లో ఉంది. కానీ వీటి మీద పవన్ ఏమాత్రం దృష్టిపెట్టలేదు.