రూటు మార్చిన రాజకీయం ..హోదాపై గొంతెత్తని పవన్ !       2018-05-30   23:06:46  IST  Bhanu C

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రూటు మార్చాడు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే సగటు రాజకీయ నాయకుడిలా మారిపోయాడు. ఆ పనిచేయడం వలన మనకు కలిసి వచ్చేది ఏమన్నా ఉందా అనే ఆలోచనలోకి వచ్చేసాడు. అందుకే గతంలో గొంతు చించుకుని మరీ `ప్రత్యేక హోదా కోసం పోరాడిన పవన్ ఇప్పుడు తన యాత్రలో ఎక్కడా ఆ ఊసే ఎత్తడంలేదు. దీనికి కారణాలు లేకపోలేదు … ఒకటి ఆ గళం ఎత్తుకోవడం వల్ల బీజేపీతో సున్నం పెట్టుకోవాలి . ఇంకొకటి ప్రతిపక్ష జగన్ పార్టీ కూడా అదే ప్రధాన ఎజెండాగా జనాల్లో తిరుగుతోంది. ఈ దశలో అదే అంశాన్ని ఎత్తుకుని జనాల్లోకి వెళ్లడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని పవన్ భావిస్తున్నాడు.

ఈ మధ్యనే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ వ్యూహాత్మక రాజకీయాలకు తెరలేపినట్టు తెలుస్తోంది. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా జనసేన ను ప్రెజెంట్ చెయ్యాలని పవన్ ఆలోచన. వస్తుందా రాదా స్పష్టంగా తెలియని ప్రత్యేక హోదా కోసం పోరాటాలకు దిగుతున్న పార్టీలు.. అదొక్కటే జనంలో సెంటిమెంట్‌ను పండించగలదని పూర్తిగా నమ్ముతున్నాయి. 2019 ఎన్నికల్లో ప్రధాన అజెండా ప్రత్యేక హోదా మాత్రమేనన్న ఆలోచనలో వారంతా ఉన్నారు.

కానీ పాత చింతకాయ పచ్చడిలా .. ఇంకా అదే పట్టుకుని వేలాడితే పెద్దగా ఒరిగే ప్రయోజనం ఏమీ లేదని అటువంటి మూస ధోరణికి తాము భిన్నం అని జనసేన సెపరేట్ రూట్ లో వెళ్తోంది. తన ప్రసంగంలో కేవలం నామమాత్రంగా మాత్రమే స్పెషల్ స్టేటస్ డిమాండ్ ని ప్రస్తావిస్తున్న పవన్ కళ్యాణ్.. తన క్రియాత్మక రాజకీయ శైలిని ప్రమోట్ చేసుకుంటున్నారు. అందరితో పాటు తాము కూడా ‘ప్రత్యేక హోదా’ అంశాన్నే పదేపదే ప్రస్తావిస్తూ.. అదే నినాదంతో ముందుకెళితే అందరిలో ఒకరిగా మిగిలిపోవాలని రూటు మార్చాడు పవన్. తన యాత్రలో ఎక్కువగా స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ… అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపుతూ ముందుకు వెళ్తున్నాడు. ఇలా చేయడం వల్ల ప్రజల్లోకి వేగంగా చొచ్చుకుని వెళ్లవచ్చని ఆయన ప్లాన్.