ఏమో మనమే కింగ్ అవ్వొచ్చు ! పవన్ అంతరంగం ఇదే !     2018-05-18   00:42:55  IST  Raghu V

కర్ణాటక ఎన్నికల ఫలితాలు అన్ని పార్టీల్లోనూ కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి.. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఇక్కడ కొన్ని పార్టీలు భుజాలు ఎగరేస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఈ మధ్యనే పూర్తిస్థాయిలో రాజకీయాల్లో దిగిన జనసేన పార్టీకి అక్కడి వ్యూహాలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఎన్నో ఉత్కంఠలు రేపుతూ.. ఓట్లు తక్కువ.. సీట్లు ఎక్కవతో అధికార బీజేపీ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో ఎలాగోలా అధికారాన్ని చేపట్టింది. ఇక ఇదే తరహా సస్పెన్స్ త్వరలో రానున్న ఏపీ ఎన్నికల్లోనూ ఉండబోతుందనేది ఇప్పుడు రాజకీయ పార్టీలు ఒక అంచనాకు వస్తున్నాయి.

కర్ణాటక పరిణామాలతో ఇప్పుడు ఏపీలో కూడా రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. జనసేన అధినేత పవన్ స్టార్ 2019 ఎన్నికలకు వ్యూహాత్మకంగా సిద్ధం అవుతున్నారు. ఈ నెల 20 వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి తన బస్సు యాత్ర ప్రారంభమవుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం వెల్లడించారు.
ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన శ్రీకాకుళం జిల్లా నుండి బస్ యాత్ర ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై పోరాటం దశగా తన పోరాట యాత్ర ఉంటుందని పవన్ చెప్తున్నాడు. ఈ యాత్రకు ‘గ్రామ్ స్వరాజ్ యాత్ర’ అని నామకరణం చేశారు.
కర్ణాటకలో జేడీఎస్ ను ముఖ్యంగా పవన్ ఆదర్శంగా తీసుకున్నట్టు జనసేన కీలక నాయకులు ఆఫ్ ది రికార్డ్ గా చెప్తున్నారు. ఏపీలో బలమైన పార్టీలుగా ఉన్న టీడీపీ – వైసీపీ పార్టీలకు స్ప్రష్టమైన ఆధిక్యత రాకపోతే అప్పుడు జనసేన ఇరు పార్టీలకు కీలకం అవుతుంది కాబట్టి అప్పుడు అసలు సిసలైన రాజకీయం నడపవచ్చని పవన్ ఆలోచన అట. అయితే అసలు పవన్ కు అంత సీన్ ఉందా లేదా అనేది అందరిలోనూ ఉన్న డౌట్ .