ప‌వ‌న్‌తో ఆ పార్టీల పొత్తులా.... స‌వాల‌క్ష సందేహాలు       2018-06-27   01:38:33  IST  Bhanu C

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు ఆస‌క్తిని రేపుతున్నాయి.. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌లో ప‌లు పార్టీలు పొత్తు దిశ‌గా అడుగులు వేస్తున్నాయి.. క‌లిసి ప‌నిచేసేందుకు, క‌లిసి బ‌రిలోకి దిగేందుకు స‌మాయ‌త్తం అవుతున్నాయి.. అయితే క‌లిసి న‌డ‌వాల‌ని చూస్తున్న పార్టీల నేత‌ల్లో అంద‌రూ అంద‌రే కావ‌డం గ‌మ‌నార్హం. ఏపీలో ప్రత్యామ్నాయ రాజ‌కీయ వేదికను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామ‌ని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ చేసిన ప్ర‌క‌ట‌న ఏపీలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు దారి తీస్తోంది.

ఏపీలో వామ‌పక్షాలు, జ‌న‌సేన‌, లోక్‌స‌త్తా, ఆమ్ ఆద్మీ పార్టీలు క‌లిసి ప‌నిచేస్తాయ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ క‌లిసి బ‌రిలోకి దిగుతాయ‌ని ఆయ‌న ప్ర‌క‌ట‌న‌లోని సారాంశం. అయితే ఆయా పార్టీల సిద్ధాంతాలు, నేత‌ల వ్య‌వ‌హార శైలితో ప్ర‌త్యామ్నాయ వేదిక ఏర్పాటు సాధ్య‌మేనా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే.. ఇందులో కాంగ్రెస్ పార్టీగానీ, వైసీపీగానీ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌తిప‌క్షాలుగానే ఉన్న ఈ రెండు పార్టీల‌ను ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ వేదిక‌లో ఎందుకు భాగ‌చేయ‌డం లేద‌న్న‌ది ఇప్పుడు అంద‌రిలో క‌లుగుతున్న ప్ర‌శ్న‌.

ఇది ఇక్క‌డికి వ‌దిలేసినా.. క‌లిసి న‌డ‌వాల‌ని చూస్తున్న వామ‌ప‌క్షాలు, జ‌న‌సేన‌, లోక్‌స‌త్తా, ఆమ్ ఆద్మీ పార్టీల నేత‌లు ఎంత‌వ‌ర‌కు ఏకాభిప్రాయానికి వ‌స్తార‌న్న‌ది మాత్రం అంద‌రిలో ఒకింత ఆస‌క్తిని రేపుతోంది. ఇందులో ప్ర‌ధాన భూమిక జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోషిస్తార‌నడంలో ఎలాంటి సందేహం లేదు. ఈయ‌న‌ను ముందుపెట్టి రాజ‌కీయంగా ల‌బ్ధిపొందాల‌న్న‌ది మిగ‌తాపార్టీల ఆలోచ‌న‌గా ప‌లువురు నాయ‌కులు భావిస్తున్నారు. అయితే.. కీల‌క పాత్ర పోషించే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌వ‌హార శైలిపైనే వామ‌ప‌క్షాలు, లోక్‌స‌త్తా, ఆమ్ ఆద్మీ పార్టీల నాయ‌కులు ఒకింత సందేహాలు వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

సాధార‌ణంగా… జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న మూడును బ‌ట్టి కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌నీ, క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా.. మిగ‌తా నాయ‌కుల అభిప్రాయాల‌తో సంబంధం లేకుండా కార్యాచ‌ర‌ణ రూపొందించుకుంటార‌నే టాక్ ఉంది. ఇటీవ‌ల ఉత్త‌రాంధ్ర‌లో ఆయ‌న చేప‌ట్టిన ప్ర‌జా పోరాట‌యాత్రే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌నే వాద‌న ముందుకు వ‌స్తోంది. ఇక లోక్‌స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాశ్‌నారాయ‌ణ‌ది ప్ర‌త్యేక మైన పంథా. ప్ర‌జ‌ల‌తో సంబంధాలు నెర‌ప‌కుండా అంతా లెక్క‌ల‌చుట్టే ఉంటార‌నే టాక్ ఉంది.

ఇక సీపీఐ, సీపీఎంల‌లో కూడా అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భిన్న‌పంథాలు, భిన్న వ్య‌క్తిత్వాలు గ‌ల నేత‌లు ఒక్క‌టిగా క‌దిలి ప్ర‌త్యామ్నాయ వేదిక‌ను ఏర్పాటు చేసి, స‌క్సెస్ అవుతారా..? అన్న‌ది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, రాష్ట్ర విభ‌జ‌న కార‌మైంద‌న్న భావ‌న‌తో కాంగ్రెస్‌ను, బీజేపీతో అంట‌కాగుతుంద‌న్న ఆలోచ‌న‌తో వైసీపీని ప్ర‌త్యామ్నాయ వేదిక‌కు దూరం పెట్టిన‌ట్లు తెలుస్తోంది.