టీఆర్ఎస్ అధ్య‌క్షుడిగా రెడ్డి క‌మ్యూనిటీ లీడ‌ర్‌..!     2017-01-04   03:41:25  IST  Bhanu C

టైంను బ‌ట్టి ప్లాన్ మార్చుకోవ‌డం అనేది పాలిటిక్స్‌లో ఉన్న‌వారికి అత్యంత అవ‌స‌రం. ఇదే ఫార్ములాను టీఆర్ ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అవ‌లంబిస్తున్నారు. గ‌తంలోనూ తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో ఎవ‌రిని ఉద్య‌మంలోకి తీసుకుంటే స‌క్సెస్ అవుతుందో చూసుకుని, వారిని ఏరికోరి ఆహ్వానించారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో మారుతున్న రాజ‌కీయాలకు అనుగుణంగా త‌న పంథాను కూడా ఆయ‌న మార్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా టీఆర్ ఎస్ అధ్య‌క్షుడిగా ఉన్న త‌న ప‌ద‌విని ఖాళీచేసి.. రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డికి అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించార‌ట గులాబీ బాస్‌.

కేసీఆర్ తీసుకున్న ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం వెనుక మంచి స్కెచ్ ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో రెడ్డి సామాజిక వ‌ర్గం ప్ర‌భావం భారీ ఎత్తున పెరుగుతోంది. ఒక‌ప‌క్క టీడీపీ నేత రేవంత్ రెడ్డి, మ‌రోప‌క్క‌, కాంగ్రెస్ నేత‌లు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి, ఉద్య‌మ నేత‌, ప్ర‌స్తుతం కేసీఆర్‌కి బ‌ద్ధ శ‌త్రువు అయిన కోదండ రాంల‌ హ‌వా సామాజికంగా పెరుగుతోంద‌ని ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు ఉప్పందించాయ‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే వాళ్లు సామాజిక పేరుతో పార్టీల‌ను బ‌లోపేతం చేసుకునేందుకు య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది. దీనికి అడ్డుక‌ట్ట వేసేందుకే కేసీఆర్ కూడా అదే పంథాలో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం.

ఈ క్రమంలో రెడ్డిల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవడం – ఒకే వ్యక్తి రెండు పదవులను చేపట్టడం సరికాదు అనే విమర్శ రాకుండా చూడటంలో భాగంగా పార్టీ అధ్యక్షుడిగా కొత్త నేతను కేసీఆర్ ఎన్నుకోనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పార్టీలో క్రియాశీలంగా పనిచేయడమే కాకుండా ఆర్థికంగా అండదండలు అందించిన పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఈ బాధ్యతలు ఇవ్వనున్నట్లు టీఆర్ ఎస్ వర్గాలు చెప్తున్నాయి. వరంగల్ జిల్లా వాసి అయిన పల్లా నల్లగొండలో రాజకీయంగా పట్టు సాధించారు. ప‌ల్లాకు గులాబీ ద‌ళం బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం ద్వారా త‌న‌పై రెండు ప‌ద‌వుల ఆరోప‌ణ‌లు స‌హా.. రెడ్డి సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు ఉంటుంద‌ని కేసీఆర్ ఎత్తుగ‌డ‌గా ఉంద‌ని తెలుస్తోంది. మ‌రో మూడు నెల‌ల్లో ఈ విష‌యంపై క్లారిటీ రానుంది.