మహారాష్ట్రలో రైతుల దండయాత్ర! 50 వేల మంది నిరసన ర్యాలీ!  

మహారాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా 50 వేల మంది రైతుల ర్యాలీ. రైతుల హామీలు అమలు చేయకపోవడానికి నిరసనగా కదిలిన జన సమూహం. .

ఈ మధ్య కాలంలో దేశంలో ఎక్కడ చూసిన రైతుల ఆందోళనలు తీవ్ర స్థాయిలో కనిపిస్తున్నాయి. దేశానికి వెన్నెముక అనే రైతు వెన్ను విరిచే విధంగా ప్రభుత్వ విధానాలతో ముందుకు వెళ్తున్న పార్టీలపై రైతులు ఉప్పెనలా ఎగసిపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ లో రైతుల ఆందోళన అందరూ చూసారు. పంటలకి గిట్టుబాటు ధరలు కావాలని కోరుతూ రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఇలాంటి రైతుల ఆందోళన ఒకటి భారీ స్థాయిలో జరుగుతుంది. మహారాష్ట్ర సర్కార్ రైతులకి ఇచ్చిన హామీలని అమలు చేయకపోవడంతో అక్కడ రైతులు పెద్ద ఎత్తున ర్యాలీగా నాసిక్ నుంచి ముంబై వరకు తరలి వెళ్ళారు. సుమారు 50 వేల మంది రైతుల సమూహం ఉప్పెనలా జనసంద్రంగా ఏకంగా 180 కిలోమీటర్ల మేర శాంతియుత ర్యాలీగా తరలివెళ్తున్నారు.

సిపీఐ, ఆల్ ఇండియా కిషన్ సభ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరుగుతున్నా ఈ కిషాన్ మార్చ్ ని మహారాష్ట్ర ప్రభుత్వం రైతులకి చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా చేస్తున్నట్లు రైతు నాయకులు తెలియజేసారు. గతంలో ఏడాది క్రితం ఇలాగే రైతు ర్యాలీ చేసి ప్రభుత్వానికి తమ డిమాండ్లు విన్నవించడం జరిగిందని, అయితే ప్రభుత్వం మాత్రం తమ డిమాండ్స్ అమలు చేయకపోగా రైతులని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని రైతు నాయకులు ఆరోపించారు. ఈ నేపధ్యంలో ఈ కిషాన్ మార్చ్ కి పిలుపునివ్వడం జరిగింది అని తెలియజేసారు. కరువు కారణంగా నష్టాన్ని ప్రభుత్వం తక్షణం చెల్లించాలని, అలాగే కనీస మద్దతు ధర, దాంతో పాటు పంటలు పండించుకోవడానికి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని, క్రాప్ ఇన్సురెన్స్ ని అమలు చేయాలని ఈ మార్చ్ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నట్లు రైతు నాయకులు తెలియజేసారు. మరి ఈ భారీ నిరసన ర్యాలీపై మహారాష్ట్ర గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.