'కత్తిపోటు' విలువ కోటి రూపాయలా ...?   One Crore Deal For Jagan Knife Attack     2018-10-28   09:32:43  IST  Sai M

వైసీపీ అధినేత జగన్ మీద జరిగిన కత్తి దాడి వ్యవహారానికి సంబంధించి రోజుకో కీలక ఆధారాలు లభ్యం అవుతున్నాయి. హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాసరావు వెనుక భారీ డీల్‌ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇటీవలే శ్రీనివాస్‌ ఠానేల్లంకలో రూ.కోటి విలువైన నాలుగు ఎకరాల భూమి కొనుగోలుకు సిద్ధపడ్డాడనే సమాచారం స్థానికంగా చర్చనీయాంశమైంది. తండ్రి తాతారావు ఉపాధి హామీ పథకంలో కూలీ. తాతారావుకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. కుటుంబంలో శ్రీనివాస్‌ ఆఖరి వాడు. ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉన్న శ్రీనివాసరావు కుటుంబం ఒక్కసారిగా కోటి రూపాయల ఖరీదైన పొలం కొనుగోలుకు సిద్ధం అవ్వడం అనేక అనుమానాలు కలిగిస్తోంది.

శ్రీనివాస్‌రావు పనిచేస్తున్న క్యాంటీన్ సిబ్బంది పలు కీలక విషయాలు మీడియాకు చెప్పారు. క్యాంటీన్ సిబ్బంది అంతా వంట గది వద్ద వారి బ్యాగులను ఉంచుకునేవారు. ఒక్క శ్రీనివాసరావుకు మాత్రమే సీసీ కెమెరాల దృష్టి పడని క్యాష్ కౌంటర్‌ వద్ద ఉంచుకునేందుకు క్యాంటీన్‌ ఓనర్‌ హర్షవర్థన్‌ అనుమతి ఇచ్చారు. శ్రీనివాసరావు వారం క్రితమే ఇంటికి వెళ్లి వచ్చారని సిబ్బంది వివరించారు. అలా వెళ్లి వచ్చినప్పటి నుంచి అతడి తీరు అనుమానాస్పదంగానే ఉందని క్యాంటీన్ సిబ్బంది ఒక మీడియా సంస్థకు చెప్పారు. కత్తి కూడా ఆరోజే తెచ్చుకుని ఉండవచ్చనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు.

One Crore Deal For Jagan Knife Attack-

వాస్తవంగా… శ్రీనివాసరావు డ్యూటీ మధ్యాహ్నం షిప్ట్‌లో ఉంటుందని. కానీ జగన్‌పై దాడి చేసిన రోజు మాత్రం ఉదయం షిప్ట్‌లోనే శ్రీనివాసరావు వచ్చారని వివరించారు. అలా ఎందుకు వచ్చాడో జగన్‌పై దాడి చేసే వరకు తమకు అర్థం కాలేదన్నారు. వారం రోజుల నుంచి అనుమానాస్పదంగా ఉంటూ వస్తున్న శ్రీనివాసరావు తాను సంచలనం సృష్టిస్తానని పదేపదే చెప్పే వారని తోటి సిబ్బంది చెబుతున్నారు. అంతే కాదు… అందరికంటే శ్రీనివాసరావు కి ఎక్కువ జీతం ఇచ్చేవారని చెబుతున్నారు.

ఠానేల్లంక సమీపంలో గోదావరి అవతల కోటి రూపాయలకు నాలుగు ఎకరాలు కొనేందుకు శ్రీనివాసరావు సిద్దమయ్యారు. ఇందు కోసం ఒక భూస్వామితో చర్చలు జరిపారు. భూమిని చూసిన తర్వాత ఓకే చేసిన శ్రీనివాసరావు వారం రోజుల్లో పది లక్షలు అడ్వాన్స్ ఇస్తానని చెప్పి వెళ్లారు. ఇంతలోనే జగన్‌పై దాడి చేశాడు. దాంతో అప్పటి వరకు చిల్లరగా తిరిగే శ్రీనివాసరావుకు కోటి రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయని ఆశ్చర్యపోయిన స్థానికులు జగన్‌పై దాడి తర్వాత షాక్‌ అయ్యారు. జగన్‌ను హత్య చేసే ప్రక్రియలో భాగంగానే శ్రీనివాసరావుకు భారీగా డబ్బు అంది ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.